ఆన్ లైన్ జూదాలు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేశాయి. పోకర్, రమ్మీ.. ఇలా ఎన్నో గేమ్స్ ఉన్న యాప్స్, వెబ్సైట్స్ లలో డబ్బులను సంపాదించుకోవచ్చనే ఆశతో తమ దగ్గర ఉన్నదంతా అందులో పెట్టేస్తూ ఉన్నారు కొందరు వ్యక్తులు. తీరా ఆన్ లైన్ లో గెలవకపోగా.. తినడానికి కూడా ఏమీ మిగిలించుకోవడం లేదు. ముఖ్యంగా యువత ఆన్ లైన్ రమ్మీకి బానిసయింది. పాకెట్ మనీ డబ్బులతో ఆడడం, లేదా వచ్చే జీతంతో రమ్మీని ఆడి డబుల్ చేసుకుందామని అనుకునే వాళ్లు మరికొందరు. కానీ తేడా వస్తే జీవితాలే తలక్రిందులు అవుతాయనే విషయాన్ని చాలా మంది మరచిపోతూ ఉన్నారు. గేమ్ మాయలో పడి చాలానే పోగొట్టుకుంటూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన ఓ ఇంజనీర్ ఆన్‌లైన్ రమ్మీకి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తిరుపత్తూరు జిల్లా కాటుకొల్లై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన ఆనందన్ చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తమ వాడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ.. అతడు రమ్మీ మాయలో పడతాడని అసలు ఊహించలేదు. ఫ్రెండ్స్ మాటలను నమ్మి ఆన్‌లైన్ ద్వారా సెల్‌ఫోన్‌లో రమ్మీకి బానిస అయ్యాడు. కొద్దిరోజులకు ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోయింది. ఎంత చెప్పినా వినకుండా రమ్మీ ఆడేవాడు. మున్సిపల్ ఎన్నికల కోసం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన ఆనందన్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆనందన్ ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.10 లక్షల నగదు పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర రూ.6 లక్షలు అప్పు చేశాడని తెలిసింది. ఈ డబ్బులు ఏ విధంగా చెల్లించాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు కిటికీలో లోపలికి చూసారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆనందన్ చనిపోయాడని వైద్యులు కూడా ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలు రాష్ట్రాల్లో ఈ ఆన్ లైన్ గ్యాబ్లింగ్ ను నిషేధించినా.. ఏదో ఒక లూప్ హోల్ ను పట్టుకుని గేమ్ ఆడుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ‘‘కాగ్నిజబుల్ అఫెన్స్’’గా పరిగణించి ఎలాంటి వారెంటూ లేకుండానే పోలీసులు అరెస్టు చేయొచ్చు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుందని చెబుతూ గత డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని ఆమోదించింది. తెలంగాణలోనూ గ్యాంబ్లింగ్‌పై ఆంక్షలు విధిస్తూ 2017లో తెలంగాణ గేమింగ్ చట్టాన్ని సవరించారు. అయితే ఇందులో అరెస్టులు చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి.