మహానాడును ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమానికి ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వాలని టీడీపీ కోరగా.. ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అవసరమైన ఫీజు చెల్లించడంతో పాటుగా ముందుగానే సంప్రదించినా కూడా అధికారులు స్టేడియాన్ని కేటాయించేందుకు ఒప్పుకోలేదని సోమవారం మహానాడు ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు మినీ స్టేడియాన్ని మహానాడుకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో వేడుకను ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను శరవేగంగా చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
ఒంగోలులోని మీని స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో త్రోవగుంట ప్రాంతంలో 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు పిలుపును ఇచ్చారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్‍కు టీడీపీ అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు.