ఇప్పటి వరకు మనం హెలికాఫ్టర్లు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వస్తే రోడ్లపై ల్యాండ్ అయిన సంధర్భాలు చూశాం.. కానీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ హెలికాప్టర్ ఒకటి మంగళవారం నాడు అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ముంబై హైలోని సాగర్ కిరణ్ వద్ద ఓఎన్జీసీ రిగ్పై ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అరేబియా సముంద్రంలో అది ల్యాండ్ అయింది. దీంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి అందులోని తొమ్మిది మందిని కాపాడింది. హెలికాప్టర్ రిగ్కు సమీపంలో ల్యాండ్ అయిన సమయంలో అందులో ఆరుగురు ఓఎన్జీసీ సిబ్బంది, ఒక కాంట్రాక్టర్, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఫ్లోటర్లను ఉపయోగించి సముద్రంపై అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టు కంపెనీ ట్విట్టర్లో తెలిపింది.
దీంతో వెంటనే రిగ్ నుంచి సహాయక బోట్లను పంపారు. భారత తీర దళం కూడా రెస్య్కూ ఆపరేషన్లో చేరింది. ఆఫ్షోర్ సప్లయ్ వెజల్ మాలవీయ-16 రంగంలోకి దిగి ఐదుగురుని కాపాడింది. ఎట్టకేలకు విజయవంతంగా హెలికాప్టర్లోని తొమ్మిది మందిని రెస్క్యూ టీమ్ కాపాడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హెలికాప్టర్ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అరేబియా సముద్రంలోని నిల్వల నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం ఓఎన్జీసీ పలు రిగ్లు, ఇన్స్టలేషన్లను ఏర్పాటు చేసింది.