శవాల గుట్టలు లేస్తాయన్నారు. ఆస్పత్రులు శ్మశాన వాటికలవుతాయన్నారు. బెడ్లు సరిపోవని బెదిరించారు. ఐసీయూల్లో ఆక్సిజన్ కూడా దొరకదని.. లక్షలాది ప్రాణాలు గాల్లో కలుస్తాయని భయపెట్టారు. సరిగ్గా ఏడాది క్రితం.. అంటే, చైనా నుంచి కరోనా మెల్లమెల్లగా ప్రపంచంపై కోరలు చాస్తున్న సమయాన.. మన దేశంలో వినపడిన మాటలివి. ఓవైపు కరోనా ముంచుకొస్తుంటే.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిందిపోయి.. విపక్షపార్టీలు, కుహనా లౌకిక మేధావులు.. ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, వారికి జతకలిసిన లెఫ్ట్, లిబరల్ మీడియా ఛానెళ్లు.. ప్రజల్లో భయాన్ని పెంచిపోషించడంలో.. ఇతోధికంగా సాయం చేశాయి. సీన్ కట్ చేస్తే.. ప్రశ్నించిన ఆ గొంతుకలు ఇప్పుడు పెకలడం లేదు. విమర్శించడానికి వారికి మాటలు దొరకడం లేదు. లాక్ డౌన్ నుంచి వ్యాక్సినేషన్ దాకా.. భారత్ కరోనా మహమ్మారిని కట్టడి చేసిన తీరుకు.. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్ లో.. కరోనా కట్టడి అసాధ్యమంటూ లెక్కలేసిన మేధావులు.. ముక్కున వేలేసుకున్నారు. వైద్య విజ్ఙానరంగంలో ఛాంపియన్లమంటూ జబ్బలు చరుచుకున్న దేశాలు.. చేష్టలుడిగి చూస్తున్నాయి. ప్రపంచానికి పెద్దన్నలా చెప్పుకుంటున్న అగ్రరాజ్యాలు.. మహమ్మారిని నిలువరించలేక సతమతవుతుంటే.. భారత్ మాత్రం కరోనా మహమ్మారికి కళ్లెం వేసింది. విపత్తు అదుపుతప్పకుండా అడ్డుకుంది. దేశానికి బలమైన నాయకత్వం, ముందుచూపు వుంటే.. ఏదైనా సాధ్యమని భారత్ నిరూపించింది. విపత్తును గుర్తించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. లోపాలను బేరీజు వేసుకుంటూ.. అత్యవసరాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగింది. ఓవైపు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు నిపుణులు, మేధావులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్ లు సిద్ధం చేసి.. పకడ్బందీగా అమలు చేసింది.
కలిసికట్టుగా కరోనా మహమ్మారిని అంతమొద్దామంటూ.. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు భారతావని సంఘీభావం తెలిపింది. మార్చి 22న జనతా కర్ఫ్యూలో భాగంగా.. ఘంటారావంతో మొదలైన ఆత్మనిర్భర భారత యాత్ర.. అప్రతిహితంగా సాగింది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. కేంద్రం కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంది. మార్చి 25 నుంచి మే 31 వరకు అంచెలంచెలుగా లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 5న మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించి.. కరోనాపై పోరాటంలో సమైక్యతను చాటింది భారత్. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్రాలు సైతం తు.చ. తప్పకుండా పాటించాయి. కేంద్రప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేశాయి. కంటైన్ మెంట్ జోన్లు.. బఫర్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా విస్తృత వ్యాప్తికి ఎక్కడికక్కడ అడ్డుకట్టవేశాయి. అటు, లాక్ డౌన్ సమయంలో ప్రధాని స్వయంగా ఎన్నోసార్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బారతీయుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. ‘దో గజ్ దూరీ, మాస్క్ హై జరూరీ’ అన్న ప్రధాని మాటను యావత్ భారతావని పాటించింది. నిబంధనల మాట సరే.. కరోనాను నిలువరించే సత్తా.. అందుకు తగిన మౌలిక సదుపాయాలు భారత్ లో వున్నాయా..? అంటే లేవనే చెప్పాలి. మనదేశంలో తొలి కరోనా కేసు నమోదయ్యేనాటికి.. భారత్ లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారుకావడం లేదు. ఎన్95 మాస్కులు అంతంతమాత్రమే. అసలు మాస్క్, పీపీఈ కిట్ అనేవి డాక్టర్లలు తప్ప.. సామాన్యులు ఎప్పుడూ వినని పదాలు. కానీ, ఇలాంటి సంక్షోభం నుంచి భారత్ వేగంగా పుంజుకుంది. అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం ఎరుగని భారత ప్రధాని.. వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆపదను అవకాశంగా మార్చేశారు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు వేశారు. మేకిన్ ఇండియా నినాదం మారుమోగింది. ఇప్పుడు మాస్కుల తయారీ వాడవాడల ఓ కుటీర పరిశ్రమగా మారిపోయింది. నేడు భారత్ లో ప్రతిరోజూ లక్షల కొద్దీ పీపీఈ కిట్లు తయారవుతునన్నాయి. ఫార్మా కంపెనీలు గ్యాలన్ల కొద్దీ శానిజైటర్లు ఉత్పత్తి చేస్తున్నాయి.
ఓవైపు కరోనా కట్టడి కోసం మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తూనే.. లాక్ డౌన్ మిగిల్చిన ఆర్థిక లోటును పూడ్చడానికి నడుం కట్టారు మోదీ. అన్ని రకాల ఉద్యోగులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు.. ఆత్మనిర్భర భారత్ అభియాన్ పేరుతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల విలువైన ఈ ప్యాకేజీ మన దేశ జీడీపీలో 10 శాతం. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చినట్టయింది. ఓవైపు దేశంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు విదేశాల నుంచి మనవారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు.. కేంద్రం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వందేభారత్ మిషన్ పేరుతో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించింది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులను, ఉద్యోగులను సొంతరాష్ట్రాలకు తరలించింది. ఓవైపు దేశంలో కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తూనే.. విదేశాలకు సైతం ఆపన్న హస్తం అందించింది భారత్. అమెరికా వంటి అగ్రరాజ్యానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను సరఫరా చేసి ఔరా అనిపించింది. ప్రపంచానికి భారత్ ఎంతో చేయగలదని, మానవాళికి ఎంతో ఇవ్వగలదనే నమ్మకాన్ని కలిగించింది.
అయితే, దేశంలో కరోనా నివారణ చర్యలు ఉపశమనం కలిగిస్తున్నా.. నానాటికీ విస్తరిస్తున్న మహమ్మారి భయానికి గురిచేస్తూనేవుంది. అందుకే, కరోనా కట్టడి చర్యలతో పాటు.. మహమ్మారిని పూర్తిగా తుదముట్టించే పనిలోనూ మోదీ సర్కార్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు. ప్రపంచ దేశాలకు దీటుగా వ్యాక్సిన్ తయారీకి ఊతమిచ్చింది. టీకా తయారీలో తలమునకలైన మన శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించిన ప్రధాని శాస్త్రవేత్తలకు భరోసా అందించారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు పనిచేసిన మన శాస్త్రవేత్తలు టీకాను సాకారం చేశారు. ప్రపంచానికి టీకా హబ్ పేరుగాంచిన భారత్.. ఊహించినట్టుగానే తక్కువ సమయంలో కరోనా టీకాను ఆవిష్కరించింది. కొవాగ్జిన్ పేరుతో భారత్ బయోటెక్ తొలి స్వదేశీ టీకాను తయారుచేయగా.. ఆక్స్ ఫర్డ్ మద్దతుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. క్లినికల్, హ్యూమన్ ట్రయల్స్ లో ఈ రెండు టీకాలు విజయవంతం కావడంతో వెంటనే కేంద్రం అనుమతి ఇచ్చి పంపిణీ ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో భాగంగా కరోనా కట్టడిలో ముందుడి పోరాటం చేసిన.. ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెలువడిన టీకాలకంటే.. భారతీయ టీకాలు నిపుణుల మన్ననలు చూరగొన్నాయి. టీకా తయారీ, పంపిణీలో భారతదేశానికి ఉన్న సత్తా మరోసారి నిరూపితమైంది. దీంతో మన స్వదేశీ టీకాలపై ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా వున్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఆర్డర్ల కోసం క్యూకడుతున్నాయి.
మొత్తానికి, మానవజాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతాన్ని.. భారతావని కలిసికట్టుగా అడ్డుకుంది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. కరోనా మహమ్మారికి పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వేగంగా విజయం సాధించింది.‘నో వేర్ టు ఎనీ వేర్’ అన్నట్టుగా ఎదిగిన భారత్.. వైద్య విజ్ఙానరంగంలో ప్రపంచానికి ఆశా కిరణంలా కనిపిస్తోంది. ప్రజలు, పాలకులకు కలిసికట్టుగా పనిచేస్తే.. అసాధ్యమనేది ఏదీ ఉండదని నిరూపించింది భారత్. ఇది కదా ఆత్మనిర్భర భారతం..! ఇది కదా భవిష్యత్తు తరాలకు అసలైన మార్గనిర్దేశనం..!!