ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ టూరిస్ట్ బస్సు 150 మీటర్ల లోయలో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుండి ఇద్దరు సిబ్బంది, 28 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో 150 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 25 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అధికారులు 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన అయిదుగురు వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఉత్తరకాశీలోని యమునోత్రి ధామ్‌కు వెళుతున్నారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం, పురోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్టా నుండి 4 కి.మీల దూరంలో ఒక టూరిస్ట్ బస్సు లోయలో పడిపోయిందని SDRF అధికారులకు సమాచారం అందింది. బస్సులో 28-30 మంది ప్రయాణికులు ఉన్నారని, 150 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేయనున్నారు.
ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదం హృదయాన్ని కలచివేసిందని పిఎంఓ ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీ అన్నారు. “ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక అధికారులు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన ట్వీట్ చేశారు.