More

    ఒమిక్రాన్ టెన్షన్.. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు తెచ్చిన భారత ప్రభుత్వం

    ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా.. దక్షిణాఫ్రికాతో పాటు ప‌లు దేశాల‌ విమానాల రాక‌పోక‌ల‌పై ప్రపంచ దేశాలు నిషేధం విధించాయి. ఇప్పుడు భార‌త్ కూడా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువ‌చ్చింది. అంతర్జాతీయ ప్రయాణాలపై తీసుకున్న‌ కీలక నిర్ణయాలను ప్ర‌క‌టించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధ‌న‌లు అమలులోకి వస్తాయి. విదేశాల నుంచి భారత్ కు వ‌చ్చే ప్ర‌తి ప్రయాణికుడు తమ 14 రోజుల ప్రయాణ వివరాల (సెల్ఫ్ డిక్ల‌రేష‌న్)ను స‌మ‌ర్పించ‌డంతో పాటు ప్రయాణానికి ముందు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని ఎయిర్ సువిధ పోర్టల్లో అప్ లోడ్ చేయాలని తెలిపింది. ఈ రెండు నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

    ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్ర‌యాణికులు భార‌త్‌లోని విమానాశ్ర‌యంలో దిగిన అనంత‌రం క‌రోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఆ టెస్టు ఫలితం వచ్చే వరకు అక్కడే ఉండాలని కేంద్ర మార్గ‌ద‌ర్శకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.ఎవరికైనా పాజిటివ్ గా తేలితే వారిని క్వారంటైన్ కు పంపుతారు. అత‌డిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉంద‌ని తేలితే క‌ఠిన ఐసోలేష‌న్ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి వ‌చ్చిన వారికి నెగెటివ్ అని తేలిన‌ప్ప‌టికీ వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ల‌లో ఉండాలని.. వారికి ఎమినిదో రోజు మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తారని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ ప్ర‌భావం లేని దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులకు ర్యాండమ్ గా టెస్టులు చేస్తారని.. ఎవ‌రికైనా పాజిటివ్ నిర్ధార‌ణ అయితే క్వారంటైన్‌కు పంపుతారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్మల్, కుమరం భీమ్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. కరోనా పరీక్షలను ఎక్కువగా చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

    ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సూచనలు చేశారని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. జనవరి 15 లోపు వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేయాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు నిర్దేశించారు. ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, పూర్తి సంసిద్ధతతో ఉండాలని సీఎం చెప్పారని వివరించారు.

    Trending Stories

    Related Stories