‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఒమర్ అబ్దుల్లా ఏమన్నారో తెలుసా..?

0
891

ది కశ్మీర్ ఫైల్స్.. కశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందిన మొదటి తరం బాధితుల జీవితాల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించారు. కశ్మీరీ పండిట్లను ఇంత దారుణంగా హింసించారా అంటూ ఎంతో మంది సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా మందికి గొంతు తడారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. జ‌మ్ము క‌శ్మీర్ లో ప్రముఖ పార్టీ అయిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఉపాధ్య‌క్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా శుక్ర‌వారం నాడు ఈ చిత్రంపై కెలక వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిత్రంలో చూపెట్టినదంతా నిజ‌మేమీ కాద‌ని అంటున్నారు. ఈ విష‌యాన్ని బీజేపీకే చెందిన క‌వీంద‌ర్ గుప్తానే వెల్ల‌డించార‌ని కూడా అబ్దుల్లా తెలిపారు.

సినిమాలో చాలా అబద్ధాలు చూపించబడ్డాయని.. కశ్మీర్ ఫైల్స్ ఒక కల్పిత కథ అని ఆయన అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఒమర్. ఇది ఒక డాక్యుమెంటరీనా లేదా సినిమానా అనేది స్పష్టంగా తెలియదని అన్నారు. “సినిమా వాస్తవికత ఆధారంగా రూపొందించబడిందని మేకర్స్ పేర్కొన్నారు. అయితే సినిమాలో చాలా అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయన్నది వాస్తవం. 1990లో కశ్మీరీ పండిట్లు అక్కడి నుండి వెళ్లిపోయే సమయంలో J&Kలో గవర్నర్ పాలన ఉంది. NC ప్రభుత్వం ఉందన్నది అతి పెద్ద అబద్ధం. కేంద్రంలో విపి సింగ్ నేతృత్వంలోని బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వం ఉండేది” అని ఒమర్ అన్నారు. “కశ్మీరీ పండిట్‌లు మాత్రమే వలస వెళ్లారు, చంపబడ్డారన్నది నిజం కాదు. ముస్లింలు, సిక్కులు కూడా చంపబడ్డారు, వారు కూడా కాశ్మీర్ నుండి వలస వెళ్ళవలసి వచ్చింది. ఇంకా తిరిగి రాలేదు” అని ఒమర్ అన్నారు. కశ్మీరీ పండిట్‌లను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో తాము ప్రయత్నం చేశామని” ఆయన అన్నారు.

ఈ సినిమా కారణంగా కశ్మీర్‌ కు చెందిన విద్యార్థులను దేశవ్యాప్తంగా లక్ష్యంగా చేసుకోవచ్చని భయపడ్డారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థిపై దాడి జరిగినా లేదా హాని జరిగినా, దానికి కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాశ్మీరీ ముస్లింలందరూ ఇతర మతాలకు వ్యతిరేకమనే భావన ఏర్పడుతోంది. బయట చదువుతున్న కశ్మీరీ యువ విద్యార్థులపై ఈ ద్వేషం కారణంగా పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందేమోనని నేను భయపడుతున్నానన్నారు అబ్దుల్లా. జమ్మూలో బీజేపీ చీఫ్ జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన గురించి ఒమర్ మాట్లాడుతూ, ఎన్‌సి పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోందని, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందని అన్నారు.