టోక్యో సిల్వర్ మెడల్ చాంపియన్, భారతదేశానికి గర్వకారణమైన సాయిఖోమ్ మీరాబాయి చాను మణిపూర్ పోలీసు విభాగంలో జాయిన్ అయ్యారు. ఆమె అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా విధులు నిర్వర్తించనున్నారు. చాను తన తండ్రి సాయిఖోమ్ కృతి మైతేయ్, తల్లి సాయిఖోమ్ టోంబితో కలిసి ఈ బాధ్యతలను స్వీకరించారు. ఆమె అధికారిక యూనిఫాం కూడా ధరించారు.
ఒలింపిక్స్‌లో ఆమె విజయం సాధించిన తర్వాత.. మణిపూర్ ప్రభుత్వం ఆమెకు ASP (స్పోర్ట్స్) గా బాధ్యతలను ఇచ్చారు. ఆమె ASP (స్పోర్ట్స్)గా నియమితులైన తర్వాత ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రికి మీరాబాయి కృతజ్ఞతలు తెలిపారు. ‘మణిపూర్ పోలీసు విభాగంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా చేరడం గౌరవంగా ఉంది. దేశానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మీరాబాయి ట్వీట్ చేశారు.
“మన దేశం గర్వించదగ్గ, ఒలింపియన్ రజత పతక విజేత మీరాబాయి చాను మణిపూర్ పోలీస్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఆమెను కలిశాను” అని ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు. ఏఎస్పీగా చేరిన తర్వాత ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని నాంగ్‌పోక్ కక్చింగ్ గ్రామానికి చెందిన చాను గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.