పాఠ్యపుస్తకాల్లో ప్రేమ పాఠాలు..!
చైనాకు ఎంత కష్టమొచ్చింది..!!

0
763

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు దశాబ్దాలుగా కష్టపడుతూనేవుంది. ఇందులో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఒకే బిడ్డను కనాలని నిబంధనలు విధించింది. ఆ సంస్కరణల ఫలితంగా జనాభా పెరుగుదల కంట్రోల్ లోకి వచ్చింది. కానీ, అవే సంస్కరణలు మరో సమస్యకు కారణమయ్యాయి. జనాభా నియంత్రణ కోసం తెచ్చిన ఒకే బిడ్డ విధానంతో చైనాలో యువతరం తగ్గిపోతోంది. దీంతో రోజురోజుకూ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం బీజింగ్ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రమాదాన్ని పసిగట్టిన చైనా.. ఇటీవలే ఇద్దరు పిల్లల్ని కనాలంటూ నిబంధనలు సడలించింది. అయినా, చైనా జంటలు ఇప్పటికీ ఒకే బిడ్డ విధానాన్నే పాటిస్తున్నారట. ఇది చాలదన్నట్టు చైనా యువత పెళ్లి సంసారం గురించి ఆలోచించకుండా.. కెరీర్ పైనా దృష్టిసారిస్తున్నారట. దీంతో యువకులు, వృద్ధుల జనాభా శాతంలో వ్యత్యాసం భారీగా పెరిగిపోతోందట.

ఈ విపత్కర పరిణామాన్ని ఎదుర్కోవడానికి.. ఇటీవల చైనాలో అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అయితే, యూత్ పాపులేషన్ ను పెంచేందుకు ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 14న సీపీపీసీసీ సమావేశంలో దేశం పురోభివృద్ధిలో స్త్రీ, పురుష పాత్రల గురించి వారి భాద్యత గురించి చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా చైనా లో ఇప్పటివరకూ ఉన్న వివాహ వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రేమ పెళ్లి వంటి అంశాలను స్కూల్ బుక్స్ లో చేర్చాలని ప్రతిపాదన చేశారు. ఈ అంశమే వివాదాస్పదంగా మారిందట. ఈ విషయంపై చాలా మంది మహిళలు వ్యతిరేకించారు. అమ్మాయిలు స్కూల్ మానేసి.. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మరీ పాఠ్యపుస్తకాల్లో ప్రేమ పాఠాలేంటని చైనా ప్రజలు అక్కడి ప్రభుత్వంపై లోలోన గొణుక్కుంటున్నారట. ఎందుకంటే, మనలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాహాటంగా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉండదు కదా పాపం. అందుకే, లోలోన జిన్ పింగ్ సర్కార్ ను తిట్టుకుంటున్నారట.

1.4 బిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, అప్పటి జనాభా పెరుగుదల నివారణ కోసం నీరు, ఇతర వనరుల డిమాండ్లను పరిమితం చేయడానికి తాత్కాలిక చర్యగా.. 1979 లో వన్-చైల్డ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు జనన రేటు పతనం కావడమేకాదు.. యువతరం తగ్గిపోతుంది. దీంతో భవిష్యత్ లో సంక్షోభం తలెత్తనున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని జనాభా వృద్ధి రేటును పెంచకపోతే, అతి త్వరలో పెను సంక్షోభం ఏర్పడనుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ ప్రొఫెసర్ కై యోంగ్ అన్నారు. హాంకాంగ్ యొక్క చైనీస్ విశ్వవిద్యాలయంలో చైనీస్ రాజకీయ నిపుణుడు విల్లీ లామ్ చెప్పారు. శ్రామిక జనాభాలో నలుగురు లో ముగ్గురు వృద్ధులు ఉండనున్నారని.. ఈ పరిస్థితి 20 సంవత్సరాలలో లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో జరగనున్నదని చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here