భారత్ సరిహద్దుల్లో చైనా సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై వంతెనను నిర్మించిన తర్వాత చైనా ఈ మూడు టవర్లను హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని లడఖ్ లోని ఓ గ్రామ కౌన్సిలర్ కొన్‌చక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాంగాంగ్ సరస్సుపై వంతెనను పూర్తి చేసిన తర్వాత మూడు మొబైల్ టవర్లను భారత భూభాగానికి సమీపంలో చైనా హాట్ స్ప్రింగ్ సమీపంలో ఏర్పాటు చేసిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. తమ గ్రామాల్లో 4జీ సౌకర్యాలు కూడా లేవని.. ఇక్కడ 11 గ్రామాలు నియోజకవర్గంలో 4జీ సౌకర్యాలు లేవని కొన్‌చక్ స్టాంజిన్ ట్వీట్‌లో పోస్ట్ చేశారు. మూడు మొబైల్ టవర్ల ఏర్పాటును చేసి చైనా తన కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.
జనవరిలో, తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సులో భాగంగా చైనా అక్రమ వంతెనను నిర్మించడాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ “ప్రభుత్వం ఈ చర్యలను నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారతదేశం అటువంటి అక్రమ ఆక్రమణను ఎన్నడూ అంగీకరించదని మీకు తెలుసు.” అని అన్నారు. పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే వంతెన చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి రెండు వైపులా త్వరితగతిన చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారత్, చైనాల మధ్య దాదాపు రెండేళ్లుగా సరిహద్దు ఘర్షణ జరుగుతోంది. బయటకేమో తాము మంచి వాళ్లమంటూ నటిస్తున్న చైనా.. సరిహద్దుల్లో మాత్రం తన బుద్ధిని చూపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచి పోషించే పనిలో ఉంది చైనా ఆర్మీ. కొద్దిరోజుల కిందటే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు వార్నింగ్ ఇవ్వగా.. ఇప్పుడు ఈ టవర్స్ విషయం బయటకు వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్.. 1962 నుండి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తోందని లోక్‌సభకు తెలియజేసారు. ఈ చట్టవిరుద్ధమైన పనిని భారత్ ఎన్నడూ అంగీకరించదని అన్నారు. 2020 వేసవిలో, పాంగోంగ్ ప్రాంతంలో సైన్యాల ఘర్షణ తర్వాత భారతదేశం- చైనా మధ్య లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడింది. అదే సంవత్సరం జూన్‌లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు 15 రౌండ్ల చర్చలు జరిపాయి. తూర్పు లడఖ్‌లోని గోగ్రా హైట్స్ ప్రాంతంలో భారత్, చైనాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు పక్షాల సైనికులు కూడా వైదొలిగారు.