More

    అమ్మకానికి పూరిజగన్నాధుడి ఆలయ భూములు..

    తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలో దేవాదాయ ఆస్తులకు ఎటువంటి రక్షణ లేదు. ప్రభుత్వాలు పలు కారణాలను వెల్లడిస్తూ ఆలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నాయి. దీనిపై గొంతెత్తి నినదించాల్సిన హిందూ సమాజం కూడా ఇంకా నిద్రాణంలోనే ఉంది. హిందూ సంఘాలు ఎన్ని పిలుపులిచ్చినా.. సాధుసంతులు ఎంత బోధ చేసినా సామాన్య హిందూ జనం ఇంకా జడపదార్ధంలా వ్యవహరిస్తున్నారని… కులం, ప్రాంత, భాష గోడలు దాటలేకపోతున్నారనేది విశ్లేషకుల మాట. దీనికి తగ్గట్టుగా రాజకీయనాయకులు కూడా అంతే స్థాయిలో హిందువులను కులాలపేరిట విభజిస్తూ.. ప్రత్యేక ప్యాకేజీలు విడుదల చేస్తూ హిందూ సమాజ నిర్వీర్యానికి అవిరళ కృషి చేస్తున్నారు. తాజాగా సంచలనమవుతున్న మరో వార్త ఇప్పడు అటు సోషల్ మీడియాలో.. జాతీయ న్యూస్ ఛానల్ వేదికల మీద చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన కొంత ప్రాధమిక సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.

    ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాధ్ ఆలయానికి సంబంధించిన భూమిని అమ్మేందుకు అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి మంత్రి ప్రతాప్ జెన అసెంబ్లీలో వెల్లడించింది. ఆలయానికి చెందిన 35,272 ఎకరాల భూమిని అమ్మేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మొత్తం 24 జిల్లాల్లో 60,426 ఎకరాల ఆలయ భూమిని గుర్తించామన్న మంత్రి.. అందులో 34,876 ఎకరాల భూమిని ఆలయ కమిటీ అధీనంలోకి తీసుకుందని తెలిపారు. ఓ విధానపరమైన పాలసీ ద్వారా ఈ భూములను అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

    ఇప్పటికే కటక్‌లోని భారత్ మఠ్ భవనంతో పాటు 315 ఎకరాల భూమిని ఇప్పటికే విక్రయించామని అన్నారు. 11.20 కోట్లు రూపాయలను ఆలయ కార్పస్ ఫండ్‌కు జమ చేశామని అన్నారు. ఒడిశాతో పాటు ఆరు ఇతర రాష్ట్రాల్లోనూ పూరి జగన్నాధ్ ఆలయ భూములు ఉన్నట్టు గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో 322, మహారాష్ట్రలో 28, మధ్యప్రదేశ్‌లో 25, ఆంధ్రప్రదేశ్‌లో 17, చత్తీస్‌గఢ్‌లో 1.7, బీహార్‌లో 0.27 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపింది.

    అంతేకాదు ఈ భూములను 30 ఏళ్లుగా వాడుకుంటున్న వారి నుంచి ఎకరానికి రూ. 6 లక్షలు తీసుకుని వారికి భూమిపై హక్కు కల్పించాలని నిర్ణయించినట్టు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. 30 నుంచి 20 ఏళ్ల పాటు ఈ భూముల్లో ఉంటున్న వారి నుంచి ఎకరానికి రూ. 9 లక్షలు తీసుకోవాలని నిర్ణయించింది. 20 నుంచి 12 ఏళ్ల నుంచి ఈ భూములు వాడుకుంటున్న వారి నుంచి రూ. 15 లక్షలు తీసుకోవాలని యోచిస్తోంది. అంతకుముందు శ్రీ జగన్నాధ్ ఆలయ కమిటీ ఈ ఆర్థిక సంవత్సరంలో 202 కోట్లు బడ్జెట్‌ను ఆమోదించింది. 2023 నాటికి రూ. 1000 కోట్ల కార్పస్ ఫండ్ సమీకరించుకోవాలని ఆలయ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే హిందువుల నైరాశ్యమే ప్రభుత్వ పెత్తనాలకు ఆజ్యం పోస్తున్నట్లుగా గోచరమవుతున్నది. ఆలయ భూములను అన్యాక్రాంత చేసి.. దాతల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నది బహిరంగ సత్యం. ఎందుకంటే దాతలు భగవంతుని సేవా వినియోగానికై భక్తి పూర్వకంగా చేసిన అర్పణలే ఈ ఆలయభూములు. వాటిని సమీకరించి హిందూ ఆధ్యాత్మిక కృషికి నడుం బిగించాల్సింది పోయి.. ఏవేవో కారణాలతో వాటిని అన్యాక్రాంత చేయడం ఎంతవరకు సబబు అన్నది ఇప్పడు బలంగా చర్చ జరుగుతున్న అంశం.

    Trending Stories

    Related Stories