More

    ట్విట్ట‌ర్‌, ఎఫ్‌బీ, యూట్యూబ్ లాంటివి న్యాయ‌వ్య‌వ‌స్థకు స్పందించడం లేదు: జస్టిస్ ఎన్వీ రమణ

    దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తబ్లిగీ జమాతే సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. వెబ్ పోర్ట‌ల్స్‌, సోష‌ల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న న‌కిలీ వార్త‌ల ప‌ట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి సంస్థ‌ల్లోనూ న‌కిలీ వార్త‌లు వ్యాపిస్తున్నాయ‌ని, ఇలాంటి సంస్థ‌లు జ‌డ్జ్‌ల‌కు కూడా స్పందించ‌డంలేద‌ని సుప్రీంకోర్టు విమర్శించింది. ఎఫ్‌బీ, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్ లాంటి సంస్థ‌లు కేవ‌లం శ‌క్తివంత‌మైన మ‌నుషుల‌కు మాత్ర‌మే స్పందిస్తున్నాయ‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు జవాబుదారీత‌నం లేద‌ని సుప్రీంకోర్టు విమర్శించింది. ట్విట్ట‌ర్‌, ఎఫ్‌బీ, యూట్యూబ్ లాంటివి న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌ట్ల స్పంద‌న ఇవ్వ‌డం లేద‌ని.. అవి చెడుగా రాశాయ‌ని, స్పందించ‌క‌పోవ‌డ‌మే కాకుండా, అది త‌మ హ‌క్కుగా పేర్కొంటున్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న తీర్పులో తెలిపారు.

    ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడుతూ సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో వార్త‌ల‌కు మ‌తం రంగు పూస్తున్నార‌ని అన్నారు. మీరు యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది, దాంట్లో ఎంత ఫేక్ న్యూస్ ఉంటుందో, వెబ్ పోర్టల్స్‌ను నియంత్రించే సంస్థ‌లు లేవు, ప్ర‌తివార్త‌కు మ‌త కోణాన్ని చూపిస్తున్నార‌ని, అదే స‌మ‌స్య అని అన్నారు. ఇది దేశానికి చెడు పేరు తీసుకువ‌స్తుంద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. 2021 ఐటీ చ‌ట్టం సోష‌ల్ మీడియాను నియంత్రిస్తుంద‌ని సోలిసిట‌ర్‌జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స‌మాధానం ఇచ్చారు. మ‌ళ్లీ ఆరు వారాల్లోగా ఈ కేసులో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సీజే తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదని అన్నారు.

    Trending Stories

    Related Stories