More

    విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్.. వారి సస్పెన్షన్

    విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన విషయంలో స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నున్న సీఐ, సెక్టార్ ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వారి ఆవేదనను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు… సాయంత్రం రావాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలానా నంబర్ నుంచి చివరి సారిగా ఫోన్ వచ్చిందంటూ చెప్పినా పోలీసులు స్పందించలేదు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో సీఐ హనీశ్, సెక్టర్ ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతా రాణా టాటా సస్పెండ్ చేశారు.

    చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులకు తక్షణం శిక్ష పడాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    దారుణ ఘటన:

    నగరంలోని పాయకాపురం వాంబే కాలనీకి చెందిన దారా శ్రీకాంత్ (26) ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్ వద్ద ఫాగింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో నివసించే 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన యువతి ఈ నెల 19న ఇంట్లో చెప్పకుండా బ్యాగులో దుస్తులు సర్దుకుని శ్రీకాంత్ పనిచేసే ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. శ్రీకాంత్ ఆమెను సరుకులు భద్రపరుచుకునే చిన్న గదిలో ఉంచాడు. అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడు తన స్నేహితుడైన జె.పవన్ కల్యాణ్‌ను ఆసుపత్రికి రప్పించాడు. అనంతరం ముగ్గురూ కలిసి మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌పై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    Trending Stories

    Related Stories