NationalTelugu States

తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్

ఊహించని రీతిలో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో దేశం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా సోకినవారిలో దాదాపు 98 శాతం మంది తిరిగి కోలుకుంటున్నా.. మిగిలినవారిలో వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. అయితే, వారిలోనూ కొందరు ఆసుపత్రుల్లో చేరి కోలుకుంటున్నప్పటికీ.. మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకుని ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో కరోనా కంటే ఈ ఆర్థికభారమే బాధితుల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం బాధితులకు వరంలా మారింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కరోనా బాధితులకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ 5 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు వుండటంతో.. ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో బాధితులకు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. కానీ, కొన్ని రాష్ట్రాలు బేషజాలకు పోయి బంగారం లాంటి ఆయుష్మాన్ భారత్ ను పక్కనపెట్టేశాయి. ఈ పథకం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో అమలవుతున్నా.. అబ్బే దానితో మాకంత యూజ్ లేదంటూ బీరాలకుపోయాయి. ఈ జాబితాలో మన తెలంగాణ కూడా వుంది. ఆయుష్మాన్ భారత్ కంటే మా ఆరోగ్యశ్రీనే బెటరని ప్రచారం చేసింది అధికార టీఆర్ఎస్. కానీ, పరిస్థితి చేయిదాటిపోయేసరికి ఆయుష్మాన్ భారత్ అవసరాన్ని గుర్తించింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిజానికి, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కనీసం ఆయుష్మాన్ భారత్ లో చేర్చినట్టుగా.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ ను కూడా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు లేని పరిస్థితుల్లో నిరుపేద కరోనా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమల్లో లేకపోవడం, కనీసం ఆరోగ్యశ్రీలోనూ కరోనా చికిత్స లేకపోవడంతో ఖరీదైన చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి. దీంతో బీజేపీ సహా విపక్ష పార్టీల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల ప్రభావమో లేక పరిస్థితులు చేయిదాటిపోతుండటమో తెలియదు కానీ.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దేశాన్ని ఆరోగ్య భారత్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మోదీ ముందస్తు ఆలోచన ఇప్పుడు కరోనా బాధితుల పాలిట వరంగా మారింది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అమలవుతున్న 24 రాష్ట్రాల్లో కరోనా బాధితులు లబ్దిపొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలోనే ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తామని ప్రకటించింది. పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు కూడా సిద్ధమయ్యాయని గత డిసెంబర్ 30న సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు అమలు చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడితో రాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుతో రాష్ట్రంలోని 26.11 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరికి కరోనా సోకినా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ పొందొచ్చు. కరోనా టెస్టులను కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు.

ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌‌‌‌కు తేడాలున్నా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదలకు క్యాష్‌‌‌‌లెస్ ట్రీట్‌‌‌‌మెంట్ అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి 2 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తే ఆయుష్మాన్‌‌‌‌లో 5 లక్షల వరకు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌‌‌‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా ఆయుష్మాన్‌‌‌‌లో 1,350 ఉన్నాయి. ఆయుష్మాన్‌‌‌‌లో లేని 540 ప్రొసీజర్స్‌‌‌‌ ఆరోగ్యశ్రీలో ఉండగా ఆరోగ్యశ్రీలో లేనివి ఆయుష్మాన్‌‌‌‌లో 685 ఉన్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు కానీ ఆయుష్మాన్ వర్తిస్తుంది. కిడ్నీ, లివర్ మార్పిడులు ఆరోగ్యశ్రీలో ఉండగా ఆయుష్మాన్‌‌‌‌లో లేవు. రెండిట్లో కామన్‌‌‌‌గా 430 ప్రొసీజర్లు ఉన్నాయి. రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ర్ట ప్రజలకు 1,887 రకాల ట్రీట్‌‌మెంట్స్‌‌ ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా లభిస్తాయి. అయితే, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స లేకపోవడంతో ప్రయివేట్ ఆసుపత్రుల్లో బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ లభించడం లేదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలుతో ఆ కొరత తీరనుంది.

తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుండగా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్‌‌ ఆధారంగా ఆయుష్మాన్‌‌‌‌ లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో రాష్ర్టంలోని 26.11 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ప్రతి కుటుంబం ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ప్రైవేట్‌‌, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ తీసుకోవచ్చు. ఈ లెక్కన 26.11 లక్షల కుటుంబాల కోసం ఏడాదికి సుమారు 300 కోట్ల వరకూ కేంద్రం భరించనుంది. రాష్ర్ట ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు, కరోనా బాధితులు దేశంలో ఎక్కడైనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎంపానెల్మెంట్ ఆసుపత్రులు 12 మాత్రమే వున్నాయి. ఆరోగ్యశ్రీ ఎంపానెల్మెంట్ ఆసుపత్రులు 337 వున్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుత్రులకూ కూడా తాత్కాలికంగా ఆయుష్మాన్ ఎంపానల్మెంట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లబ్ధిదారుల వివరాలు ఆయుష్మాన్ భారత్ పోర్టల్​లో ఇప్పటికే ఎంటర్ చేసి ఉన్నాయి. ఇందులో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆయుష్మాన్ హెల్త్ కార్డు వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ఎంపానల్‌మెంట్ ఉన్న హాస్పిటల్‌లో ఫ్రీగా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. లబ్ధిదారుల లిస్టులో పేరు ఉందో లేదో mera.pmjay.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =

Back to top button