More

    ప్రముఖ వీణా విద్వాంసురాలు మల్లాప్రగడ జోగులాంబ కన్నుమూత

    ప్రముఖ వీణా విద్వాంసురాలు మల్లాప్రగడ జోగులాంబ కన్నుమూశారు. 80 సంవత్సరాల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున విశాఖపట్నంలోని తన స్వగృహంలో జోగులాంబ తుదిశ్వాస విడిచారు. దేశ విదేశాల్లో ఎన్నో సంగీత కచేరీలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా వీణా నిలయ విద్వాంసురాలుగా సేవలందించారు. శాస్త్రీయ సంగీత కుటుంబంలో పుట్టిన ఆమె 7 సంవత్సరాల వయస్సులోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. హెచ్. నరసింహారావు, కె. జోగారావు, ‘వైణిక శిరోమణి’ వాసా కృష్ణమూర్తిలచే కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. విజయ త్యాగరాజ సభ నిర్వహించిన పోటీల్లో మూడు బంగారు పతకాలు అందుకున్న ఈమె 1996లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.

    ఈ ఏడాది జనవరి 21న ఆమెను సంగీత కళాభారతి బిరుదుతో సత్కరించారు. 50 సంవత్సరాలకు పైగా జోగులాంబ గాత్రం, వీణలో అనేక వందల సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. విశేష భక్తి రంజని, అపురూప స్వర పల్లవలు, శ్రీ ముత్తయ్య భాగవతార కృతులు, వీణా పంచకం, దేవీ వైభవం, సంప్రదాయ మంగళ హారతులు, గౌరీ శంకర వైభవం, మహతి నాద ఝరి ఆమె చేసిన కొన్ని ప్రముఖ స్వరకల్పనలు. దేశ విదేశాల్లో ఆమె ఎన్నో సంగీత కచేరీలు చేశారు. ఆకాశవాణి సంగీత సమ్మేళనం, పలు జాతీయ కార్యక్రమంలలో ఆమె పాల్గొన్నారు. ఆమె మృతి పట్ల పలువురు నివాళులు అర్పించారు.

    Trending Stories

    Related Stories