More

  ఆలయాల్లోకి హిందూయేతరులు..! మద్రాస్ హైకోర్టు షాకింగ్ తీర్పు..!!

  కొన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు చాలా ఆశ్చర్యకరంగా, నమ్మలేని విధంగా ఉంటాయి. ఈ మధ్య ఎన్నో సంచలనాల తీర్పులకు మద్రాస్ హైకోర్టు కేంద్రబిందువుగా మారుతోంది. తాజాగా ఇచ్చిన తీర్పు కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించలేమని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసింది.

  ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు సంకుచిత దృష్టితో ఆలోచించలేవని, విశాల హృదయంతో ఆలోచించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రముఖ నేపథ్య గాయకుడు జె.ఏసుదాస్‌ హిందూయేతరుడైనా ఆయన ఎన్నో హిందువుల భక్తిగీతాలు ఆలపించారని, వేలాంకన్ని చర్చి, నాగూర్‌ దర్గాకు అనేక మంది హిందువులు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారని గుర్తు చేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ప్రజలు దైవభక్తితో ఆలయాలకు వెళ్తే.. వారి మతాన్ని ధ్రువీకరించడంలో సమస్యలు నెలకొంటాయని అభిప్రాయపడింది. అయితే, కుంభాభిషేకాల్లో హిందూయేతరులు ప్రవేశించరాదనే నిబంధన హిందూ దేవాదాయశాఖ నిబంధనల్లో లేదని స్పష్టం చేసింది. అందువల్ల హిందూ ఆలయాల్లోకి, కుంభాభిషేకాలకు హిందూయేతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

  ఇప్పుడే కాదు గత ఫిబ్రవరిలోనూ మద్రాస్ హైకోర్టు ఆలయాలపై షాకింగ్ తీర్పునిచ్చింది. దేశంలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న వేళ.. ఆ హైకోర్టులో శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ దాఖలు చేసిన పిటిషన్లపై సంచలన తీర్పును వెల్లడించింది. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేయాలని.. హిందూయేతరులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని రిట్ పిటిషన్లు వేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మునీశ్వర్‌ నాథ్‌ భండారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది హిజాబ్‌ కోసం, ఇంకొంత మంది దేవాలయాల్లో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్భ్రాంతికరంగా ఉన్నదన్నారు. అసలు ఏంటి ఇదంతా? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా? అని ఆవేదన చెందారు.

  దేశం ముఖ్యమా?.. మతం ముఖ్యమా? అని ప్రశ్నించారు. హిజాబ్‌ వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనే ఈ పిటిషన్లు దాఖలు కావడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆలయాల్లో డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని ఏ చట్టం చెప్పిందని పిటిషనర్‌నుప్రశ్నించింది. సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకొంటున్నారని అడిగింది. మనది లౌకిక దేశం అన్న సంగతి మర్చిపోకూడదని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఏదేని ఒక ఆలయంలో నిబంధనలు ఉంటే దాని ప్రకారం అక్కడ నడుచుకోవచ్చని, కానీ.. అన్ని చోట్లా డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని పిటిషనర్‌ కోరడం సమంజసం కాదని జస్టిస్‌ భండారీ అన్నారు. డ్రెస్‌ కోడ్‌పై కచ్చితమైన వివరాలు లేనప్పుడు ఆలయాల్లో నోటీసు బోర్డులపై ఏమని రాయాలని ప్రశ్నించారు. ఆగమ శాస్త్రంలో ఉన్న సమాచారాన్ని అందించాలని పిటిషనర్‌ను అడిగారు. దానికి సంబంధించిన ప్రతిని అందజేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా, అందుకు కోర్టు సమ్మతించింది. మరోవైపు ఒక్కో దేవాలయం ఒక్కో ఆచారాన్ని అనుసరిస్తున్నదని, ఇతర మతస్థులను ధ్వజ స్తంభం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తమిళనాడు అడ్వొకేట్‌ జనరల్‌ ఆర్‌ షణ్ముగసుందరం కోర్టుకు తెలిపారు. డ్రెస్‌ కోడ్‌పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆ తర్వాత సుధీర్ఘ వాదనల విన్న మద్రాస్ హైకోర్టు తాజా తీర్పును వెల్లడించింది.

  Trending Stories

  Related Stories