National

ఎన్డీయే దూకుడు తట్టుకోలేక.. సైడ్ అయిన మమతా బెనర్జీ

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే మద్దతిచ్చిన అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ద్రౌపది ముర్ము దూకుడుగా ముందుకు వెళ్లారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,824 మంది ముర్ముకు ఓటు వేయగా.. 1877 మంది యశ్వంత్ సిన్హాకు ఓటు వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,72,377. ఇందులో ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 6,76,803.. ఇక యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 3,80,177గా ఉంది. మొత్తం పోలైన ఓట్ల విలువలో ద్రౌపది ముర్ము 64.04శాతం సాధించగా.. యశ్వంత్ సిన్హా 35.97 శాతంతో సరిపెట్టుకున్నారు.

ఇక త్వరలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్టు టీఎంసీ ప్రకటించింది. ఈ ఓటింగ్ కు తమ పార్టీ దూరంగా ఉంటుందని మమత మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు సరిగా లేదని, అందుకే, తాము విపక్షాల అభ్యర్థికి మద్దతును ఇవ్వబోమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని తెలిపారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున జగదీప్ ధన్కడ్, విపక్షాల తరపున మార్గరెట్ అల్వా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 6న ఓటింగ్ జరగనుంది.

Related Articles

Back to top button