More

  కిమ్ రాజ్యంలో మరో అంటువ్యాధి.. దాని తీవ్రత ఎంతో తెలుసా..?

  కోవిడ్ వెలుగులోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా మహమ్మారికి ఉత్తర కొరియా చిగురుటాకులా వణుకుతోంది. మే నెల ఆరంభం నుంచి అక్కడ విజృంభణ కొనసాగుతోంది. మూలిగే నక్కపై తాటి టెంక పడ్డట్టు కోవిడ్-19తో సతమతమవుతున్న ఉత్తర కొరియాకు కొత్త ముప్పు ముంచుకొస్తోంది.

  తాజాగా, అక్కడ అంతుచిక్కని ఓ వ్యాధి భయపెడుతోంది. ఆగ్నేయ ఉత్తర కొరియాలోని రేవు నగరం హేజులో ప్రజలు అంతుచిక్కని అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యాధిబారినపడ్డ రోగులకు అవసరమైన ఔషధాలను అందజేస్తున్నట్టు ఆ దేశ అధికార మీడియా కేసీఎన్‌ఏ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబం కోసం నిల్వ ఉంచిన వ్యక్తిగత ఔషధాలను బాధితులకు అందజేయాలని సూచించారని తెలిపారు. అయితే బాధితుల సంఖ్య, తీవ్రత గురించి మాత్రం మౌనంగా వ్యవహరిస్తోంది. వివరాలను బయటకు పొక్కనీయడం లేదు. కొత్త అంటువ్యాధి తీవ్రతపై అస్పష్టత నెలకొంది. మహమ్మారి-సంబంధిత కష్టాలను అధిగమించడానికి ప్రజల మద్దతు అవసరం ఎక్కువ కాబట్టి ప్రజల జీవనోపాధి గురించి శ్రద్ధ వహించే నాయకుడిగా కిమ్ ఇమేజ్‌ను పెంచడమే ఉత్తర కొరియా లక్ష్యంగా పెట్టుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ హడావుడి అందుకేనని అంటున్నారు. ఉత్తర కొరియా పత్రిక రోడాంగ్ సిన్మన్ సైతం కిమ్, అతడి సతీమణి రి సోల్ జు తాము ఇస్తున్న ఔషధాలను పరిశీలిస్తున్న ఓ ఫోటోను ఫ్రంట్ పేజ్‌లో ప్రత్యేకంగా ముద్రించింది.

  ఈ అంతుచిక్కని రోగం టైఫాయిడ్, విరేచనాలు లేదా కలరా వంటి అంటు వ్యాధిని సూచిస్తుంది.. ఇవి కలుషితమైన ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తుల మలం లేదా సంపర్కం ద్వారా సూక్ష్మక్రిముల వల్ల కలిగే పేగు అనారోగ్యమని అంటున్నారు. మంచి నీటి శుద్ధి సౌకర్యాలు లేని ఉత్తర కొరియాలో ఇటువంటి వ్యాధులు సాధారణంగా సంభవిస్తాయి. 1990ల మధ్యకాలం నుంచి దీని కారణంగా ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా పెద్ద సంఖ్యలో జనం జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్టు ఉత్తర కొరియా వెల్లడించింది. అయితే, ఆ జ్వరం కేసుల్లో మీజిల్స్, టైఫాయిడ్, పెర్టుసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్టు దక్షిణ కొరియా గూఢచారి సంస్థ చెబుతోంది.

  ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 4,558,260 కరోనా కేసులు నమోదు కాగా.. 73 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించింది. 4,511,950 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కొత్తగా 26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ఉత్తర కొరియాలో ప్రస్తుత పరిస్థితులు కేవలం శాంపిల్ అని కరోనా అక్కడ పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర కొరియాలో ఆరోగ్య వ్యవస్థ సరిగాలేకపోవడం అని చెబుతున్నారు. అంతేకాకుండా పౌరులకు వ్యాక్సిన్ అందజేయడంలోనూ కిమ్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.

  Trending Stories

  Related Stories