దక్షిణ కొరియాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను యూఎస్‌బిలో చైనా ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తికి మరణశిక్ష విధించారు. చిన్న చిన్న వాటికే కిమ్ జాంగ్ ఉన్ శిక్షలు ఇలా ఉంటాయని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఆ సిరీస్ ను చూసినందుకు ఏడుగురు హైస్కూల్ విద్యార్థులు కూడా కఠిన శిక్షలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక వ్యక్తి చైనా వెళ్లినప్పుడు స్క్విడ్ గేమ్‌ను యూఎస్‌బీ డ్రైవ్‌లో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత దాన్ని చూశాడు. ఈ విషయం తెలిసిన అధికారులు ‘స్క్విడ్ గేమ్’ స్మగుల్ చేసినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి మరణశిక్ష విధించారు. అలాగే దీన్ని కొని చూసిన విద్యార్థికి జీవితఖైదు విధించినట్లు రేడియో ఫ్రీ ఆసియా అనే వార్తాసంస్థ వెల్లడించింది.
స్మగ్లర్ నుండి USB కొనుగోలు చేసిన ఒక విద్యార్థికి జీవిత ఖైదు విధించబడింది. అతనితో పాటు దానిని చూసిన మరో ఆరుగురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వాహకులను కూడా విధుల నుండి తొలగించారు. గనులలోని మారుమూల ప్రాంతాలలో పని చేయడానికి వారిని పంపించారు. స్క్విడ్ గేమ్స్ అనేది నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రసిద్ధ దక్షిణ కొరియాకు సంబంధించిన డ్రామా సిరీస్. భారీ నగదు బహుమతి కోసం పిల్లల గేమ్ లను ఆడిపిస్తారు. షోలో ఓడిపోయిన ఆటగాళ్లకు మరణశిక్ష విధిస్తారు. ఇలా ఇతర దేశాలకు సంబంధించిన షోలను అసలు చూడకూడదని కిమ్ నియమాలను విధించాడు. ఎవరైనా విదేశీ ప్రసారాలను చూస్తూ లేదా వింటూ పట్టుబడితే, వారు కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు.
హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల్లో ఒకరు రహస్యంగా ‘స్క్విడ్ గేమ్’ ఉన్న USBని కొనుగోలు చేసి, తన స్నేహితులతో కలిసి చూశాడు. విషయం బయటకు తెలిసి ఇతరులు కూడా దాన్ని చూడాలని అనుకుని.. వారు USBని పంచుకున్నారు. అయితే సెన్సార్ లు వారిని పట్టుకున్నాయి. ఉత్తర కొరియాకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, నిఘా బ్యూరో సంస్థ ఉంది, ఇది అక్రమంగా వీడియోలను చూసేవారిని పట్టుకుంటుంది. కొన్ని దేశాలకు సంబంధించిన మీడియా, వీడియోలను వీక్షించడం, ఉంచడం లేదా పంపిణీ చేసినందుకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. ప్రస్తుతానికి, కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేయబడ్డాయి. టెలివిజన్ డ్రామా ఉత్తర కొరియాలోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరినీ విచారిస్తూ ఉన్నారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ను తొలగించారు. ఉపాధ్యాయులు ఇప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని గనులలో పని చేయనున్నారు. తమ విద్యార్థులలో ఒకరు ‘చట్టవిరుద్ధమైన వీడియోలు’ చూస్తూ పట్టుబడితే ఉపాధ్యాయులు కూడా శిక్షలను ఎదుర్కోవాల్సిందే..!