2025 వరకూ తక్కువగా తినాల్సిందే.. కిమ్ చెప్పేశాడు

ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల విభాగం చెబుతోంది. అయితే ఈ నివేదికపై ఆ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని అన్నారు. తాము ఈ నివేదికను గుర్తించడం లేదని కిమ్ తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ఉత్తర కొరియా దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. దేశంలో కఠినమైన లాక్ డౌన్ వంటివి విధించింది. దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతోంది.
కిమ్ తన దేశ ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. 2025 వరకు ప్రజలు తక్కువగా ఆహారం తీసుకోవాలని.. చైనాతో సరిహద్దులు ఓపెన్ కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని కిమ్ సూచించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మరియు బలహీనమైన స్థితిస్థాపకత, తగినంత వ్యవసాయ పదార్థాలు మరియు తక్కువ స్థాయి యాంత్రీకరణ ఈ ఆహార కొరతకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఏ నివేదికను కూడా కిమ్ పట్టించుకోలేదు. తమ దేశంలోని పౌరుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి తామే పూర్తి బాధ్యత వహిస్తామని, తమ గురించి ఆందోళన చెందాలని ఎవరినీ అడగడం లేదని ఉత్తర కొరియా చెబుతోంది.