More

    కేరళలో కొత్త వైరస్.. సోకితే వాంతులు, విరేచనాలు

    ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ ను కట్టడి చేయలేకపోతున్నారు అధికారులు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా తగ్గినా కూడా కేరళలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మరో వైరస్ ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. కేరళలో ‘నోరో వైరస్’ కలకలం మొదలైంది. జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా సోకుతుంది. నోరో వైరస్ కేసులను కేరళలోని వాయనాడ్ లో గుర్తించారు. వాయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి. వాంతులు మరియు విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

    రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి స్పందిస్తూ… నోరో వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ వైరస్ మరింత ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో దీని పట్ల విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించాలని అధికారులను ఆదేశించారు. వాయనాడ్ లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి వీణా జార్జి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి ముప్పు లేకపోయినా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. రెండు వారాల క్రితం వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ నమోదైంది. పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నివారణ చర్యల్లో భాగంగా పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. వెటర్నరీ కళాశాల అధికారులు మాట్లాడుతూ క్యాంపస్ హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులలో మొదట ఇన్ఫెక్షన్ కనుగొనబడిందని అన్నారు. ఆరోగ్య అధికారులు త్వరగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం అలప్పుజాలోని ఎన్‌ఐవికి పంపారు.

    నోరో వైరస్ అనేది అనేక రకాల వైరస్ ల సమూహం. ఇది ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి అస్వస్థతకు గురిచేస్తుంది. ఉదరం, పేగుల్లోని కీలక పొరను దెబ్బతీస్తుంది. దీని ప్రభావంతో తీవ్రస్థాయిలో వాంతులు, విరేచనాలతో బాధపడతారు. డయేరియా, కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలను ఈ వైరస్ కలిగిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులపై ఇది పెద్దగా ప్రభావం చూపదని, అయితే చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి నోరో వైరస్ ముప్పుగా మారుతుందని నిపుణులు తెలిపారు. జంతువుల ద్వారానే కాకుండా, ఈ వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కూడా ఇది మనుషులకు వ్యాపిస్తుంది.

    సూపర్ క్లోరినేషన్ సహా పలు నివారణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. త్రాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని.. నివారణ మరియు సరైన చికిత్సతో వ్యాధిని త్వరగా నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు.

    Trending Stories

    Related Stories