వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పళ్ల కాలం వచ్చేసిందని అర్థం..! ముఖ్యంగా మామిడి పళ్లంటే ఇష్టం ఉన్న వాళ్ళు రకరకాల మామిడి కాయలను కొనేసి.. తినేయాలని అనుకుంటూ ఉంటారు. మామిడి కాయలు తక్కువగా దొరికే సమయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. కానీ కొన్ని రకాల మామిడి పళ్లను కొని తినాలంటే మాత్రం జేబులకు చిల్లులు పడడం పక్కా..!
ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ‘నూర్జహాన్’ రకం మామిడి పండ్ల గురించి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీ రాజ్ పూర్ జిల్లాలో ఈ రకం మామిడి పళ్లు దొరుకుతూ ఉంటాయి. గతేడాది కంటే ఎక్కువ ధరకు ఈ ఏడాది ఈ రకం పళ్లను అమ్మినట్లు రైతులు తెలిపారు. ఈ రకం మామిడి ఒక్కో పండు ధర ఈ ఏడాది 500 నుండి 1200 రూపాయల మధ్య పలికింది. గతేడాది కంటే ఈ ఏడాది బాగా పండాయని కూడా చెప్పుకొచ్చారు.
ఈ రకం మామిడి పళ్లకు ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్నాయని తెలిపారు. అలీరాజ్ పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతం ఈ రకం మామిడిని పండించేందుకు అనుకూలమైనదని తెలుసుకుని. పెద్ద ఎత్తున వీటిని నాటారు. ఈ ప్రాంతం ఇండోర్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివరాజ్ సింగ్ జాదవ్ అనే మామిడి తోపు యజమాని మాట్లాడుతూ ‘నా తోటలో మూడు చెట్లు ఈ రకానికి చెందినవి ఉన్నాయి. మూడు చెట్లలో 250 కాయల దాకా కాశాయి. ఒక్కో మామిడి ధర 500 నుండి 1000 రూపాయలు పలుకుతున్నాయని.. ఇప్పటికే వీటికి సంబంధించిన బుకింగ్స్ కూడా పూర్తయ్యాయని వెల్లడించాడు. మధ్యప్రదేశ్, గుజరాత్ కు చెందిన వాళ్లు చాలా రోజుల కిందటే వీటి కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. నూర్జహాన్ రకం ఒక్కో మామిడి కాయ బరువు ఈ ఏడాది 2 నుండి 3.5 కిలోల దాకా ఉందని తెలిపారు.
మామిడి పళ్ల నిపుణుడు ఇషక్ మన్సూరి మాట్లాడుతూ.. ఈ ఏడాది మామిడి పళ్లు బాగా పండాయని.. అయితే కరోనా కారణంగా బిజినెస్ సరిగా లేదని తెలిపారు. 2020 సరైన వాతావరణం లేక నూర్జహాన్ రకం సరిగా పండలేదని తెలిపారు. ఈ ఏడాది మాత్రం కొందరికి బాగా గిట్టుబాటు అయిందని అన్నారు. 2019 లో 2.75 కేజీల బరువు ఉన్న ఒక్క మామిడి పండు 1200 రూపాయలు పలికిందని స్పష్టం చేశారు. ఈ మామిడి పండు రుచి కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపారు.