కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో మాజీ సీఎం నారాయణ స్వామికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం.. తాజాగా కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. అందులో తాజా మాజీ సీఎం నారాయణస్వామి పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాంగ్రెస్ ముఖ్య నేతలైన సెల్వనందని కదిర్గామం అసెంబీ స్థానం నుంచి, ఎం. కణ్ణన్ ఇందిరానగర్ స్థానం నుంచి, కార్తికేయన్ ఔసుడు నియోజకవర్గం నుంచి, రమేశ్ ప్రేమ్‌బత్.. మహే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా వీటిలో 5 స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దాదాపు 10 లక్షలకుపైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
పుదుచ్చేరిలో.. ఇటీవలే ప్రభుత్వం కుప్పకూలింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కొద్ది రోజుల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనం రేపింది. మొన్నటిదాకా నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ ఉన్నట్టుండి ఒక డీఎంకే, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో బలపరీక్షకు వెళ్లగా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి తప్పలేదు. కాగా బలపరీక్షకు ముందే ఫిబ్రవరి 22న నారాయణసామి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 23న నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరిపైనా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ బీజేపీ- అన్నాడీఎంకే కూటమి గెలుస్తుందా లేక కాంగ్రెస్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్న దానిపై రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ నేత, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామికి టికెట్ కేటాయించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపింది. ఎన్నికల ప్రచారం, నిర్వహణ బాధ్యతలను నారాయణ స్వామి చూసుకుంటారని ఏఐసీసీ పుదుచ్చేరి ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ప్రకటించారు.
2016 ఉప ఎన్నికల్లో నెల్లిథోపె నుంచి ఆయన గెలిచారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి ఆ సీటును డీఎంకే అభ్యర్థి వి.కార్తికేయన్‌కు కేటాయించారు. పుదుచ్చేరి రూరల్ ఉమెన్స్ కాలేజీకి చైర్మన్‌గా కార్తికేయన్ ఉన్నారు. అయితే నారాయణ స్వామి పోటీ చేసినా, చేయకపోయినా తమకెలాంటి ఇబ్బందీ లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. నెల్లిథోపె నుంచి డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదనే విషయం ఆయనకు బాగా తెలుసుననీ, అందుకే ఆయన ఆ నియోజకవర్గం నుంచి పారిపోతున్నారని విమర్శించింది. బీజేపీ-అన్నాడీఎంకే కూటమి పుదుచ్చేరిలో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ గత పాలనపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఉండటం.. సీఎంపై అవినీతి ఆరోపణలు, ఆయన పాలనపై సొంత పార్టీ నేతలు కూడా విమర్శించడంతో నారాయణస్వామిని తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతనెలలో స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొన్న ఓ సభలో ఒక మహిళ నష్టపరిహారం గురించి సీఎంను నిలదీయగా.. ఆయన మాత్రం దానిని తనకు అనుకూలంగా చెప్పినట్టు చెప్పుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నారాయణ స్వామికి టికెట్ నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.