చీర కట్టుకున్న మహిళను రెస్టారెంట్ లోకి అనుమతించలేదు.. దేశ రాజధాని లోనే..!

భారతదేశంలో చీరలు కట్టుకోవడం సంప్రదాయం..! అయితే ఓ మహిళ చీర కట్టుకుందని రెస్టారెంట్ లోకి అనుమతించకపోవడం ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదంటూ చెప్పి రెస్టారెంట్లోకి రానివ్వలేదు సిబ్బంది.

ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి మార్గంలోని అన్సల్ ప్లాజాలో ఉన్న అక్విలా బార్ అండ్ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. దీంతో చీర ధరిస్తే రెస్టారెంట్‌లోనికి అనుమతించకూడదన్న డ్రెస్ కోడ్ గురించి తనకు చూపించాలని ఒక మహిళ అక్కడి సిబ్బందిని నిలదీసింది. అయితే ‘మేము స్మార్ట్ క్యాజువల్‌ని మాత్రమే అనుమతిస్తాము. చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదు’ అంటూ సిబ్బంది సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ రెస్టారెంట్ డ్రెస్ కోడ్ విధానంపై మండిపట్టారు. ఇది వివక్షతతో కూడిన నిబంధన అని ఆరోపించారు. అమెరికా, బ్రిటన్, యూఏఈలోని ఉత్తమ రెస్టారెంట్లలో కూడా తాను చీరలు ధరించినట్లు పలువురు నెటిజన్లు చెప్పారు. అక్విలా రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
చీర భారతీయ సాంప్రదాయ దుస్తులు. రెస్టారెంట్ ఉద్యోగి, బహుశా మేనేజర్ మాట్లాడుతూ రెస్టారెంట్లో స్మార్ట్ క్యాజువల్స్ డ్రెస్ కోడ్ ఉందని.. అందులో చీర లేదని చెప్పడం వినవచ్చు. వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు రెస్టారెంట్ కు దారుణమైన రేటింగ్స్ ను ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. జొమాటో యాప్ లో ప్రజలు హోటల్ గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ రేటింగ్ ఇటీవలి కాలంలో దారుణంగా పడిపోయింది.

