More

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ, జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆయా తేదీల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నామని తెలిపింది. అంతేకాకుండా వారి సిఫార్సు లేఖలు ఈ తేదీల్లో అనుమతించమని దేవస్థానం పేర్కొంది. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులుకు కరోనా వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది.

    శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జనవరి 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపింది.

    ఇక ఇటీవల సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 10 వేల చొప్పున, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చిన టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లోనే బుక్‌ అయిపోయాయి. కేవలం పది నిమిషాల్లో వారాంతాలతో పాటు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక టికెట్లన్నీ బుక్‌ అయ్యాయి. టీటీడీ అధికారులు డిసెంబర్‌ 28 నుంచి శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి కోటాను డిసెంబర్ 28 మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా జనవరి 1న వెయ్యి బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) అందుబాటులో ఉంచనున్నారు. ఇక జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500) విడుదల చేయనున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్‌ దర్శన టికెట్లు(రూ.500).. శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల(రూ.500)ను టీటీడీ అందుబాటులో ఉంచనుంది.

    Trending Stories

    Related Stories