More

    విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు

    విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని రైల్వే శాఖ స్పష్టంగా చెప్పేసింది. విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలు సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకనే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో లాభాల విషయాన్ని పక్కనపెట్టి కొన్ని ప్రాంతాల్లో కేంద్రం రైల్వే జోన్లు ఏర్పాటు చేసిందని, ఏపీ విషయంలోనూ అలానే చేయాలని ఏపీ బృందం కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. సమావేశం అనంతరం తమ ప్రభుత్వం తరపున వినిపించిన వాదనల గురించి తెలంగాణ ప్రభుత్వం 5 పేజీల పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏపీ మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

    Trending Stories

    Related Stories