నేటి నుండి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు టీటీడీ పేర్కొంది. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్లు తెలిపింది. కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేలా తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్ ఫొటోలను రైల్వే శాఖ నిన్న విడుదల చేసింది. ఈ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పనులకు సంబంధించి కాంట్రాక్టులను కూడా ఇచ్చేశామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రైల్వే శాఖ విడుదల చేసిన డిజైన్లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భవనం డిజైన్ సాదాసీదాగా ఉందని, ఒక ఐటీ కార్యాలయం భవనం మాదిరి ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.