More

    HAMAS కోటలో.. MOSSAD వేట..!

    ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాచీనమైనవి రెండే రెండు వృత్తులు. మొదటిది పడుపు వృత్తి. రెండోది గూఢచర్యం. ఈ రెండు వృత్తులకూ సామీప్యాలున్నాయి. ధనం, అందం, మోసం ఈ మూడూ… ఈ రెండు వృత్తుల్లోని సామాన్య లక్షణాలు… అంటుంది నార్మన్ పోల్మర్-థామస్ బి.అలెన్ లు ఉమ్మడిగా రూపొందించిన ‘‘Spy encyclopedia’’.

    ఇజ్రాయిల్ ఏర్పడింది మొదలు ఆ దేశ సైన్యం రెండు అంతర్ బాహిర్ యుద్ధాలు చేసింది. ఒకటి శతృవును సరిహద్దువైపు కన్నెత్తకుండా చేయడం, రెండవది: కఠినమైన నైతిక నిష్ఠను, దేశభక్తినీ, శతృవుపట్ల కరిగిపోని కసిని కాపాడుకునేందుకు కఠోరమైన రాక్షస కృషి చేసింది.

    ఇజ్రాయిల్ సైనిక శక్తి ఈ స్థాయి పాటవం ప్రదర్శించడానికి కారణమేంటి? నిఘావిభాగం ‘మోస్సాద్’ ఆ దేశాన్ని ఎలా రక్షిస్తోంది? ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసే మిలట్రీ చర్యలకు ఇజ్రాయిల్ తీసుకునే జాగ్రత్తలేమిటి? పాటించే క్రమశిక్షణ ఎలా ఉంటుంది? ఇంత ఉక్కు క్రమశిక్షణ, వైరి ఆనుపానులు తెలిసినా మోస్సాద్ విఫలమైన సందర్భాలున్నాయా?మోస్సాద్ ఏజెంట్ సిల్వియా రాఫెల్ ను హమాస్ డెత్ స్వ్వాడ్స్ ఎలా వెంటాడాయి? ‘ నో మిషన్ ఇంపాజిబుల్’ పుస్తకంలో ఏముంది? పాకిస్థాన్ అణు పరిశోధన సంస్థ కహుటాను ఇజ్రాయిల్ ధ్వంసం చేయాలనుకుందా? భారత్ అందుకు సహకరిస్తే ఆ చర్య జరిగిపోయేదా? మోస్ట్ వాంటెడ్ ‘రెడ్ ప్రిన్స్’ను మోసాద్ ఎలా హతమార్చింది?

    కంపనకు ప్రకంపన సృష్టించడం, హింసకు ప్రతిహింసను జవాబుగా చెప్పడం, దాడికి ప్రతిగా ఎదురుదాడి చేయడం, ఘటనకు ప్రతిఘటనను ప్రతీకారంగా మార్చడం, సవాలుకు ప్రతి సవాలు విసరడం యుద్ధంలో ఆనవాయితీ. ఇజ్రాయిల్ సైనిక, నిఘా విభాగాలు అందుకు భిన్నం. ఇజ్రాయిల్ ఆవిర్భావం నాటికి ఆ దేశ జనాభా కేవలం 6లక్షల 50 వేలు. ఇజ్రాయిల్ ఏర్పడిన వెంటనే 3 కోట్ల జనాభా ఉన్న 5 అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ పై దాడికి దిగాయి. అయినా సరే వెరవలేదు ఆ దేశం. వీరోచిత యుద్ధం చేసి మాతృభూమిని కాపాడుకుంది.

    యుద్ధాన్ని-ఓటమిని ఏకకాలంలో వైరికి తెలియజేయడమే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రత్యేకత. కంపన-ప్రకంపనలను సద్యోజనితంగా సృష్టిస్తుంది ఐడీఎప్. శతృవు తేరుకునే లోపు దాడికి మరో అదనపు దాడిని జత చేస్తుంది. ప్రతిదాడికి వీలులేని వికృత స్థితిని మిగిల్చి రణరంగాన్ని కకావికలం చేస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, పశ్చిమాసియా యుద్ధ చరిత్రను నిశితంగా చదివిన వారికి తారసపడే చకచ్చకిత వాస్తవం. పశ్చిమాసియాలోనే కాదు ప్రపంచ దేశాలకు రక్షణ మంత్రాన్ని నేర్పుతున్న ఇజ్రాయిల్ యుద్ధంలోనూ-నిఘాలోనూ అసాధారణ కృషి చేసింది.

    సాధారణంగా యుద్ధంలో ముప్పేట దాడి ఉంటుంది. కానీ, ఇజ్రాయిల్ చేసే యుద్ధంలో నలువైపుల కాదు, ఏకంగా ఐదువైపుల నుంచీ దాడికి దిగుతుంది. గుక్కతిప్పుకోలేని దాడిలో శతృవు నిస్సహాయ స్థితికి చేరి లొంగుబాటుకు సిద్ధమవుతాడు.

    1948 తరవాత భౌగోళికంగా తమకున్న అనుకూలతలను ఇజ్రాయిల్ సద్వినియోగం చేసుకోవాలనుకుంది. పదిలక్షలకుపైగా వలసదారులను దేశంలోకి స్వాగతించింది. అత్యంత వేగంగా శక్తివంతమైన సైనిక వ్యవస్థను నిర్మించింది. 1967 నాటికి సొంతంగా అణ్వాయుధాలను రూపొందించుకునే స్థాయికి ఇజ్రాయిల్ చేరింది. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో గెలవడమే లక్ష్యంగా అక్కడి సైనిక శిక్షణ కొనసాగింది.

    ఇజ్రాయిల్ ఏర్పాటు తర్వాత ఆ దేశ పగ్గాలు చేపట్టిన బెన్ గరియన్ ఇజ్రాయిల్ ను కేవలం సైనిక శక్తి మాత్రమే కాపాడలేదని గుర్తించారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రమే సరిపోదని అంచనా వేశారు. ప్రమాదకరమైన భవిష్యత్తు గురించి పకడ్బందీ ప్రణాళికలు రచించాడు బెన్ గరియన్. ‘‘ప్రపంచంలో రాజకీయ చతురత కన్నా సైనిక పాటవం మాత్రమే కాపాడగలిగే ఏకైక దేశం ఇజ్రాయిల్’’ అంటూ వ్యాఖ్యానించాడు బెన్ గరియన్. ఈ దూరదృష్టి కారణంగానే మోస్సాద్ ఇవ్వాళ అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థగా ఎదిగింది.

    మొదటి ఇంతిఫదా ఆరంభానికి ముందే ఇజ్రాయిల్ ‘మ్యూనిక్’ గాయానికి గురైంది. అప్పటికి ‘హమాస్’ ఏర్పడలేదు. కానీ, యాసిన్ అరాఫత్ మానస పుత్రుడు, రక్త రుచిమరిగిన వేటగాడు హసన్ సాలెమ్ లాంటి పాలస్తినా కమాండర్లు ఇజ్రాయిల్ పౌరులపై దాడులకు తెగబడుతున్న కాలమది. బ్లాక్ సెప్టంబర్ దాడులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ తో పాటు విదేశాంగ నిఘా సంస్థ మోస్సాద్ కు సవాళ్లు విసురుతున్నాయి.

    1972లో మ్యూనిక్ ఆపరేషన్ అనంతరం, బ్లాక్ సెప్టెంబర్ ఆర్గనైజేషన్ హత్యలు మరింత పెరిగాయి. ఆనాడు మ్యూనిక్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లిన 11 మంది ఇజ్రాయిల్ క్రీడాకారులను బీఎస్ఓ హత్య చేసింది. దీన్ని బ్లాక్ సెప్టెంబర్‌గా పేర్కొంటారు. ఈ హత్యల్ని కేవలం ఇజ్రాయిల్ పౌరుల హత్యగా చూడలేదు ఆ దేశం. అనేక దేశాల వైఖరులను ఈ సందర్భంగా అంచనా వేసుకుంది.

    అథ్లెట్ల హత్య విషయంలో జర్మనీ చూసీచూడనట్లు ఊరుకుంది. ఇజ్రాయిల్ బలగాలు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంది. దీంతో యూరప్ దేశాల సార్వభౌమత్వాన్ని పట్టించుకోకూడదనీ, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తమ శతృవును మట్టుబెట్టాలని ఇజ్రాయిల్ నిర్ణయించుకుంది.

    మ్యూనిక్ ఉగ్ర దాడికి కారణమైన ముష్కరులను ఒక్కొక్కరుగా హతమార్చేందుకు “OPERATION WRATH OF GOD” ని సిద్ధం చేసింది.ఈ ఆపరేషన్ లో అత్యంత కీలక మైనది సాలెమ్ హత్య.

    మ్యూనిక్ దాడికి పథక రచన చేయడమే కాదు, ప్రత్యక్షంగా ఆపరేషన్ లో పాల్గొన్న రెడ్ ప్రిన్స్ హసన్ సాలెమ్ ను వదల కూడదని మోసాద్ నిర్ణయించుకుంది. ముగ్గురు ఏజెంట్లను బీరుట్ కు పురమాయించింది. మొదటి దఫాలోఓ మహిళా ఏజెంట్ బీరుట్ లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంది. సాలెమ్ సన్నిహితురాలిగా మారింది. సాలెమ్ కదలికలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత 1979 జనవరి 22న పార్కింగ్ నిలిపిన కారులో పేలుడు పదార్థాలు అమర్చి సాలెమ్ ను హతమార్చింది మోసాద్.

    ఈ పేలుడు పదార్థాలను బీరూట్ కు తరలించేందుకు ఊహకందని పథకాన్ని రచించింది. ఫర్నీచర్ రూపంలో పేలుడు పదార్థాలను తయారు చేసి జోర్డాన్, సిరియా మీదుగా వాటిని బీరూట్ కు తరలించింది. ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు క్రిస్టియన్ పేర్లున్న ముగ్గురు రహస్య ఏజెంట్లను ఏడాదిన్నరపాటు బీరూట్ లో ఉంచింది.

    సాలెమ్ ను హతమార్చడం మోసాద్ కు అంత తేలికగా సాధ్యం కాలేదు. సిల్వియా రాఫెల్ అనే ఏజెంట్ ను నియమించినా దీన్ని గుర్తించిన నార్వే ప్రభుత్వం రాఫెల్ ను అరెస్ట్ చేసి ఖైదూ చేసింది. ఈ ఆపరేషన్ బెడిసికొట్టిన తర్వాత మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యూనిక్ హంతకదాడికి ప్రతీకారం తీర్చుకుంది.

    1987లో ‘హమాస్’ ఏర్పాటు తర్వాత మొదటి ‘ఇంతిఫదా’ ప్రారంభమైంది. ఇంతిఫదా మోసాద్, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ కు మరిన్ని సవాళ్లు విసిరింది. మొదటి, రెండో ఇంతిఫదాలకు సుదీర్ఘ కాలం కమాండర్ గా వ్యవహరించిన ఖాలిద్ అబూ హిలాల్ ఇజ్రాయిల్ పౌరుల, మోసాద్ ఏజెంట్ల హత్యకు డజన్లకొద్ది పథకాలు రచించి అమలు చేశాడు. చివరకు మోసాద్ చేతికి చిక్కాడు.

    పాక్ అణ్వాయుధ వ్యాప్తిని ఇజ్రాయిల్ నిరోధించాలనుకుందా?

    ఇజ్రాయిల్ సహాయంతో సరైన సమయంలో భారతదేశం ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపగలిగి ఉండేదనే చర్చలు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ నిజంగానే పాకిస్తాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఉత్సాహం చూపించిందా? ఆ పని పూర్తి చేయడానికి గుజరాత్‌లోని ఎయిర్ బేస్‌ను ఉపయోగించుకోవాలని అనుకుందా? కహుటాలో పాకిస్తాన్ చేస్తున్న అణ్వాయుధ కార్యక్రామాన్ని ఆపే అవకాశాన్ని ఇండియా చాలాసార్లు వదులుకుందా?

    భారతదేశంలో 1975లో అత్యయిక పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దేశంలో మొట్టమొదటిసారి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది. పాకిస్తాన్‌తో 1971 యుద్ధం తర్వాత భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్-RAW పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారకుండా ఉండేందుకు ఒక రహస్య ఆపరేషన్ కూడా చేపట్టింది. 1977లో పాకిస్తాన్‌ కహుటా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లూ ప్రింట్‌ ను సంపాదించింది.

    దీంతో పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ‘రా’ నిర్ధారణకు వచ్చింది. పాకిస్తాన్‌లో ఉన్న తన గూఢచార నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేసింది రా. ఇస్లామాబాద్ సమీపంలోని కహుతా దగ్గర అణ్వాయుధ ప్రయోగం కొనసాగుతున్నట్లు ఒక సీక్రెట్ మిషన్‌లో ‘రా’ గుర్తించింది. ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి ‘రా’ గూఢచారులు మరో ఆపరేషన్ చేపట్టారు.

    కహుటాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల తల వెంట్రుకలు సేకరించారు. సైంటిస్టులు జట్టు కత్తిరించుకోవడానికి వెళ్లే సెలూన్‌కి వెళ్లి వారి తల వెంట్రుకల శాంపిళ్లను సేకరించారు. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించింది ప్రస్తుత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. శాంపిళ్లను భారతదేశానికి పంపారు. ఆ వెంట్రుకల్లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నట్లు నిరూపితమైంది. అంటే, ఆ శాస్త్రవేత్తలు పని చేస్తున్న చోట అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించిన ముందస్తు ప్రక్రియ జరుగుతోంది.

    ఈ సమాచారం తెలిసిన తర్వాత కహుటా ప్లాంట్ బ్లూ ప్రింట్ కోసం ‘రా’ ఆపరేషన్ కహుటాను ప్రారంభించింది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయిల్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇరాక్ న్యూక్లియర్ ప్లాంటును ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లుగానే భారతదేశం కూడా పాకిస్తాన్‌లోని కహుటా అణు కేంద్రాన్ని పేల్చేయాలని అనుకుంది. ఇందుకు మోసాద్ సాయం తీసుకోవాలనుకుంది.

    గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు ప్రవేశించేందుకు గుజరాత్‌లోని జామ్‌నగర్ ముఖ ద్వారం. అందుకే విదేశాల్లో కొనుగోలు చేసిన చాలా విమానాలను ఇక్కడికే తీసుకొస్తారు. పాకిస్తాన్‌లో ఉన్న కహుటా అణు కేంద్రంపై కొత్తగా కొనుగోలు చేసిన జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ తో దాడి చేయాలని భారత్ భావించింది.

    1983 ఫిబ్రవరిలో భారత సైనికాధికారులు రహస్యంగా ఇజ్రాయిల్‌లో పర్యటించారు. కహుటా ప్లాంటు భద్రత వ్యవస్థను గుర్తించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం గురించి వాకబు చేశారు. అయితే అది అలభ్యమని తేలింది. పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్ల సమాచారాన్ని ఇజ్రాయిల్ భారత్ కు ఇచ్చింది.

    దాడికోసం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆరు ఎఫ్-16 ఫైటర్ జెట్లు, 6 ఎఫ్-15 విమానాలు ఇజ్రాయిల్‌లోని హైఫా నుంచి బయలుదేరి దక్షిణ అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోని జామ్‌నగర్ చేరాలి. అక్కడ పైలట్లు కాసేపు ఆగి కావాల్సిన మార్పులు-చేర్పులూ చేసుకోవాలి.

    ఇదే సమయంలో పేలుడు సామగ్రి, ఇతర పరికరాలతో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం సి-17 జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుంది. ఎఫ్-16 విమానాలు జామ్‌నగర్‌లో బయలుదేరి గాలిలోనే ఇంధనం నింపుకుని ఉదంపూర్ చేరాలి. అక్కడి నుంచి ఈ విమానాలు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాలి. అయితే, రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు పర్వత శ్రేణుల మీదుగా ఎగరాలనేది పథకం. పర్వతాల సానువుల మీదుగా ఈ విమానాలు బయటకు వచ్చేలోగా రెండు ఎఫ్-16 విమానాలు కహుటా అణు కేంద్రంపై బాంబులు వేయాలి.

    ఇదే సమయంలో ఎఫ్- 15 విమానాలు మాత్రం గాలిలోనే ఉంటాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడికి దిగితే ఇవి అడ్డుకుంటాయి. ఈ దాడి తర్వాత ఎఫ్-16 విమానాలు పశ్చిమ దిక్కుగా ఎగిరి పాకిస్తాన్ గగనతలాన్ని దాటేస్తాయి. పర్వతాల్లో ఇజ్రాయిల్ విమానాలను ఎదుర్కొనే సాహసాన్ని పాకిస్తాన్ విమానాలు చేయలేవనేది ఇజ్రాయిల్ వ్యూహకర్తల అంచనా. ఇదంతా నిజంగానే జరిగిందా? లేదా? అనేది రహస్యంగానే ఉండిపోయింది.

    ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో సోవియట్ రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉండడం మూలంగా ఇజ్రాయిల్ తో కలిసి ఆపరేషన్ నిర్వహించడాన్ని ప్రభుత్వం అనుమతించలేదనే వాదన ఉంది. మరోవైపు పాకిస్తాన్ పై చేసే ఈ దాడికి పూర్తి బాధ్యత తమపైనే వేసి భారత్ చేతులు దులుపుకుంటుందేమోననే అనుమానంతో ఇజ్రాయిలే దీన్ని విరమించుకుని ఉంటుందనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ‘కహుటా ఆపరేషన్’ నిజంగానే జరిగి ఉంటే దక్షిణాసియా పరిణామాలు మరోలా ఉండేవంటారు నిపుణులు.

    మొత్తంగా పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ పక్కలో బల్లేలను పెట్టుకుని, కేవలం నిఘాను నమ్ముకుని సవాళ్లను లెక్కచేయకుండా మనుగడ సాగిస్తోంది. ప్రస్తుత పరిణామాలు యుద్ధానికే దారితీస్తే మరోసారి పాలస్తినా ఓటమి పాలుకాక తప్పదా? మారిన భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో పాలస్తినాకు మద్దతు లేని స్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో పాలస్తినా దుస్సాహసానికి ఒడిగడుతుందా? వేచి చూడాల్సిందే!

    Trending Stories

    Related Stories