తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిన సంగతి తెలిసిందే..! తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు. పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గిపోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ వచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆ నిర్ణయమే తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ కూడా ఉండబోదని తెలుస్తోంది.