భారత్-పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ 2023 ఫైనల్ లో తలపడతాయని అందరూ ఆశించారు. అయితే శ్రీలంక సొంతగడ్డపై పాక్ కు షాక్ ఇచ్చింది. ఇక ప్రపంచ కప్ లోనే భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న ప్రశ్నకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, భారత్‌లో చొరబాట్లను అరికట్టే వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ లు ఉండదని బీసీసీఐ చాలా కాలం క్రితమే నిర్ణయించిందని ఠాకూర్ తెలిపారు. కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికాధికారులు వీరమరణం పొందిన నేపథ్యంలో, కేంద్రం భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లపై తన వైఖరి మరోసారి వెల్లడించింది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేంతవరకు పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దేశ ప్రజల అభిప్రాయాలు కూడా తమకు ముఖ్యమేనని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపాల్సిందేనని అన్నారు. అలా జరిగిన తర్వాతే పాక్ తో ఎలాంటి క్రీడా కార్యక్రమాలైనా జరుగుతాయని అన్నారు అనురాగ్ ఠాకూర్.
2012-13 సీజన్ లో ఇరుదేశాల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఇతర టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఆసియా కప్ 2023లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ తో రెండు మ్యాచ్ లు ఆడింది. ఆసియా కప్ 2023ని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని భావించారు. అయితే భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తమ జట్టును పంపలేమని బీసీసీఐ తెలిపింది. చివరికి హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని శ్రీలంకలో కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష I.N.D.I.A కూటమిపై కూడా అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. కొందరు నాయకులు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. వారంతా విద్వేషంతో కూడుకున్న మాల్ ను ప్రారంభించారని అన్నారు. మొహబ్బత్ కి దుకాన్ గురించి నాకు తెలియదు, కానీ కొంతమంది విద్వేషపూరిత మాల్ ను ప్రారంభించారని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని I.N.D.I.A కూటమి నాయకులు అంటున్నారని, ఇలాంటి వాటికి రాహుల్ గాంధీ వారికి లైసెన్స్ ఇచ్చారన్నది స్పష్టం అవుతోందని కేంద్రమంత్రి అన్నారు.