హిందూ మతమంటే భయం.. బీజేపీ అంటే ద్వేషం.. భారతదేశం అనే ఒక చారిత్రక, సాంస్కృతిక ఆలోచనే నచ్చని అరాచకత్వం. మన దేశంలో చాలా మందిలో చూడొచ్చు..! చాలా ప్రాంతాల్లోనూ విచిత్ర, విభిన్న వాదనలు, సిద్ధాంతాలు మనం ఆలకించవచ్చు. అసలు ఆయా వ్యక్తులు, సంస్థల ఉద్దేశం ఏంటంటే.. వివిధ భాషలు, భావాలు, ఆచార, సంప్రదాయాలు కలగలిసిన ఈ సనాతన వేద భూమి ముక్కలవ్వాలి. చిన్న చిన్న దేశాలుగా మారి అంతర్గత పోరాటాలతో, యుద్ధాలతో అట్టుడకాలి. రక్తం చిందాలి, హింస జరగాలి. ఒకే సనాతన ధర్మాన్ని విశ్వసించే భారతీయులు.. తమ యుగయుగాల బంధాన్ని, అనుబంధాన్ని మరిచి.. ఎడారి మతాల ప్రభావంలో మగ్గిపోయి.. సర్వనాశనం కావాలి. ఇదీ మన దేశంలోని చాలా మంది అరాచక శక్తుల అంతర్లీనమైన ఆశయం..! అదృష్టవశాత్తూ.. అది ఇంత వరకూ సంపూర్ణంగా జరగలేదు. దురదృష్టవశత్తూ అది పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఏర్పడ్డాక కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.
మనకు ఉత్తరాన ఉన్న కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు దాపురించాయి, అవి ఇప్పుడిప్పుడే ఎలా సద్దుమణుగుతున్నాయి చూస్తూనే ఉన్నాం. అసలు కశ్యప ఋషి పేరు మీదుగా కశ్మీరమైన మంచు ప్రపంచం భారతదేశంలో భాగం కాదనే వారు బోలెడు మంది. పాకిస్థాన్‌లో కాదు.. భారత్‌లోనూ అలాంటి జాతి ద్రోహులు ఉండటం విచారకర విషాదం..! అయితే, వేర్పాటువాద సమస్య కేవలం దేశానికి ఉత్తరాన మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. ఊరికి ఉత్తరాన ఉన్నట్టువంటి వారే.. దక్షిణాన కూడా దశాబ్దాలుగా దాపురించారు. తాజాగా తమిళనాడులో మరోసారి భారత వ్యతిరేక శక్తులు గళం విప్పాయి. గరళం చిందించాయి.
తమిళ ప్రాంత వేర్పాటువాదులు జిహాదీ శక్తులంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వారి అసంబద్ధ, అబద్ధపు చారిత్రక పిడివాదనలకి.. సినిమా గ్లామర్ కూడా తోడు కావటం ఆందోళనకర పరిణామం. ఉత్తరాది వారు వేరు, మేము వేరు అంటూ కొందరు తమిళులు, తమిళ మేధావులు చేసే గొడవ ఈనాటిది కాదు. అత్యధిక తమిళ ప్రజల మనోభావాలు వీరి వాదోపవాదాలకి భిన్నంగా ఉన్నా.. అప్పుడప్పుడూ భారీ చర్చ మాత్రం తప్పటం లేదు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి.. వీరంతా భారతదేశానికి, తమిళనాడుకి మధ్య సన్నటి గీత గీస్తూనే రాజకీయం నడిపారు. వారి ప్రభావానికి లోనైన వారు తమిళనాడుతో పాటూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. కాలం చెల్లిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని అప్పుడు, ఇప్పుడు కూడా బలవంతంగా చెలామణి చేయించే ప్రబుద్ధులు దక్షిణాన అనేక మంది. ఇప్పుడు కూడా అలాంటి వారు మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ సినిమాను పట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు. దానికి బీజేపీకి బద్ద వ్యతిరేకి అయిన కమల్ హాసన్ కూడా తోడయ్యారు.
‘పీఎస్-1’ పేరుతో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిశ వంటి వారు నటించిన ఓ భారీ చారిత్రక చిత్రం విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ‘పొన్నియన్ సెల్వన్’నే ‘పీఎస్’ అంటూ షార్ట్‌గా మార్చారు ఇతర భాషల వారి కోసం. తమిళంలో పొన్నియన్ సెల్వన్‌గా విడుదలైన మణిరత్నం మూవీ ఓ కల్పిత కథే. అయితే, దాన్ని రాసింది కల్కి కృష్ణమూర్తి అనే ప్రఖ్యాత తమిళ రచయిత. చోళ రాజుల కాలంలో జరిగిన ఓ ఊహాజనిత ప్రణయగాథకి.. కల్కీ నవలా రూపం ఇచ్చారు. తరువాత చాలాసార్లు ఎంజీ రామచంద్రన్, కమల్ హాసన్ వంటి వారు సినిమాగా తీద్దామనుకున్నారు. వారి వల్ల కాలేదు. చివరకు, మణిరత్నం దశాబ్దాల నీరిక్షణ తరువాత రెండు భాగాల సినిమాగా జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలం అయ్యారు. పీఎస్-1.. పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో ఫస్ట్ పార్ట్. కాగా తమిళ రాజుల కాలం నాటి ఈ కల్పిత కథ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దేశమంతటా పెద్ద విజయం సాధించింది. పీఎస్-1 తో పాటూ విడుదలైన హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేదా’ సినిమాను కాదని హిందీ ప్రేక్షకులు కూడా మణిరత్నం మూవీకే జైకొడుతున్నారు. కోట్లాది రూపాయల వసూళ్లతో పీఎస్-1 దూసుకుపోతోంది. అయితే, భారత జాతి మొత్తం అద్భుతంగా ఆదరిస్తోన్న చారిత్రక చిత్రంపై ఓ తమిళ దర్శకుడు, హీరోగారి దృష్టి పడింది. దాని చుట్టూ కాంట్రవర్సీ లేవదీసి.. వివాదంలోకి తమిళనాడు బీజేపీని కూడా లాగారు.
పీఎస్-1 సినిమాని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓ వేదికపై తమిళ దర్శకుడు వెట్రిమారన్ విచిత్రమైన వ్యాఖ్య చేశాడు. పొన్నియన్ సెల్వన్‌గా పిలువబడే ‘రాజ రాజ చోళుడు’ హిందువు కాదట..! బీజేపీ పార్టీ వారు తమిళనాడుని కాషాయమయం చేస్తున్నారని ఉక్రోశం వెళ్లగక్కిన మేధావిగారు.. అపర శివభక్తుడైన రాజ రాజ చోళుడు హిందువే కాదని జ్ఞానోదయం చేశారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా గుడ్డిగా సపోర్ట్ చేసే కమల్ హాసన్ సారు.. సై అంటూ బరిలోకి దిగేశారు. ఆయన వాదన ప్రకారం.. బ్రిటిషర్లు వచ్చి మనల్ని హిందువులు అనే దాకా ఆ పదమే లేదట..! అంతకు ముందు శైవం, వైష్ణవం వంటి పద ప్రయోగాలు మాత్రమే ఉండేవట..! అందుకే, బ్రిటిషర్లు రాక ముందే తమిళనాడుని పరిపాలించిన రాజ రాజ చోళుడు హిందువు కాదని వెట్రిమారన్, కమల్ హాసన్ వంటి ద్రవిడ వాద మేధావులు నొక్కి వక్కాణిస్తున్నారు..!
తంజావూరులో పరమశివుడి కోసం వందల అడుగుల ఎత్తైన బృహదీశ్వరాలయం నిర్మించిన రాజ రాజ చోళుడు హిందువు కాకపోతే మరెవరు..? ఇదే ప్రశ్న వేస్తున్నారు తమిళనాడు బీజీపీ వారు..! పొన్నియన్ సెల్వన్‌గా పిలవబడే రాజ రాజ చోళుడు ఒక్క మసీదైనా నిర్మించాడా..? పోనీ చర్చ్ కట్టించాడా..? తన జీవిత కాలంలో ఎన్నో భవ్యమైన శివాలయాలు, విష్ణు ఆలయాలు నిర్మింపజేసిన ఆయన హిందువు ఎందుకు కాడో చెప్పాలని తమిళనాడు బీజేపీ నేతలు వెట్రిమారన్, కమల్ హాసన్ బృందాన్ని నిలదీస్తున్నారు..!
అసలు పీఎస్-1 సినిమా చుట్టూ మొదలైన కాంట్రవర్సీని మనం ఇంకాస్త లోతుగా తరచి చూస్తే.. మాజీ ఐపీఎస్ అన్నామలై నాయకత్వంలో తమిళనాడు బీజేపీ గతంలో కంటే చాలా యాక్టివ్ గా మారింది. అదే యాంటీ బీజేపీ సెలబ్రిటీలకు కాస్త ఇరకాటంగా మారింది. సహజంగానే కమలం పార్టీపై కస్సుబుస్సుమనే కమల్ గురించైతే చెప్పక్కర్లేదు. అదే ఇప్పుడు రాజరాజ చోళుడి విషయంలోనూ విచిత్ర వ్యాఖ్యలు చేయిస్తోంది. శివుడ్ని ఆరాధించిన ఓ రాజాధిరాజు హిందువు కాదని చెప్పటం ఎవరికైనా అంత తేలిగ్గా బోధపడే విషయం కాదు. కానీ, వెట్రిమారన్, కమల్ వంటి వారి తపనంతా ‘హిందూ’ అనే పదం సాధారణ తమిళ జన బాహుళ్యంలోకి ప్రవేశించకూడదనే. వారి దృష్టిలో సనాతన సమాజం ఇంకా శైవ, వైష్ణవ విభేదాలతో విడివిడిగా ఉండాలి. అలా ఉంటేనే డీఎంకే మొదలు పలు ఇతర ద్రవిడ పార్టీల పబ్బం గడుస్తుంది. హిందీ వ్యతిరేక ఉద్యమమైనా, హిందూ పదం పట్ల వ్యతిరేకత అయినా వారి రాజకీయ వ్యూహంలో భాగమే. మిగతా భారతదేశం అంతా కలసికట్టుగా ఉన్నా.. కేవలం తమిళ ప్రాంత జనాల్ని వేరుగా ఉంచటం దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న బ్రిటిషర్ల కాలపు కుట్ర.
భారత్‌లోని ఇతర చోట్లలో అనేక విధాలుగా కుల వ్యతిరేక పోరాటాలు జరిగాయి. అంబేద్కర్ వంటి వారు పుట్టింది కూడా ఒక విధంగా ఉత్తర భారతదేశంలోనే. ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయినా నార్త్‌లో ఎప్పుడూ భారతదేశం అనే ఆలోచనకు వ్యతిరేకత రాలేదు. తమిళనాడులో మాత్రం దళితులకి, అగ్రవర్ణాలకి మధ్య అగాధం సృష్టించారు. అలాగే, ఉత్తర భారతీయుల పట్ల, వారు మాట్లాడే హిందీ పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. అదే సమయంలో తమిళనాడు నుంచి అనేక మంది స్వతంత్ర సమరయోధులు కూడా తెర మీదకొచ్చారు. ముస్లిమ్ పాలకులకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వారు పోరాడారు. అనేక దశాబ్దాల పాటూ భారత జాతీయ కాంగ్రెస్ తమిళనాడుపై ఆధిపత్యం కొనసాగించింది. అనేక తమిళనాడు జాతీయవాదులు కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించారు. అయినా కూడా స్వాతంత్ర్యం తరువాత తమిళ నేలపై వేర్పాటువాదం ఎప్పటికప్పుడు గడబిడ చేస్తూనే ఉంది. ఎల్టీటీఈకి మద్దతు పలికే వాళ్లు మొదలు ప్రత్యేక ద్రవిడ దేశం కావాలనే దద్దమ్మల వరకూ అప్పడప్పుడూ మనకు అందరూ కనిపిస్తూనే ఉంటారు. వాళ్లలో ఈ తరం వారే పీఎస్-1 చిత్రంపై విచిత్రమైన వివాదం లేవనెత్తారు.
ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాకి మూలమైన పొన్నియన్ సెల్వన్ నవల రాసింది కూడా ఓ జాతీయవాది, అగ్ర వర్ణానికి చెందిన కల్కీ కృష్ణమూర్తే. ఆయన కాంగ్రెస్‌లో ఉంటూ గాంధీ పీలుపుకి స్పందించి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాదు, ‘కల్కి’ ఆయన కలం పేరు..! కల్కి అంటే విష్ణువు దశావతారాల్లో రాబోయే చివరి అవతారం. దాన్ని తన కలం పేరుగా మార్చుకున్న రచయిత తాలూకూ నవలే పీఎస్-1 చిత్రానికి మూలం. అయినా, వెట్రిమారన్, కమల్ హాసన్ వంటి ప్రబుద్ధులు పొన్నియన్ సెల్వన్ సినిమాని, ఏకంగా రాజ రాజ చోళుడ్నే.. హిందూ మతంలోంచి బయటకు తీసుకువెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఓ బ్రాహ్మణ హిందూ రచయిత రాసిన పుస్తకంలోని.. శివ భక్తుడైన రాజుని.. హిందువు కాదని చెప్పే ఘనకార్యం చేస్తున్నారు..!
ఇదంతా కేవలం బీజేపీ మీద వ్యతిరేకతో అయితే.. తమిళ మేధావులు తప్పులో కాలేస్తున్నట్టే..! ఎందుకంటే, కమలం పార్టీని రాజకీయంగా ఎదుర్కొంటేనే జనం ఆహ్వానిస్తారు. అంతే తప్ప.. సమాజంలో దాదాపుగా సమసిపోయిన శైవ, వైష్ణవ భేదాల్నిమరోమారు గుర్తు చేస్తూ.. హిందూ వ్యతిరేకతని చాటుకుంటే.. ఇప్పటి తరం తమిళ ఓటర్లు పెద్దగా పట్టించుకోరు. అందుకు ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిన కమల్ హాసన్ ప్రత్యక్ష సాక్ష్యం. జనం నవ్వుకుని ఊరుకునే మాటల వల్ల ఏ లాభమూ ఉండదు. తమిళ సినీ సెలబ్రిటీలకు, మేధావులకు అంతగా కాషాయ వ్యతిరేకత ఉంటే.. ఎన్నికల్లో బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పొన్నియన్ సెల్వన్ అలియాస్ రాజ రాజ చోళుడు శివ భక్తుడే కానీ.. హిందువు కాదంటే.. పీఎస్-1 సినిమాకి మరో నాలుగు రోజులు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది తప్ప.. ఇంకెటువంటి లాభమూ ఉండదు..! కాస్తో, కూస్తో తమిళనాడు బీజేపీకి కూడా నాలుగు ఓట్లు పెరగొచ్చు.. కమల్ హాసన్ బాగా ఆలోచించుకోవాలి..!