More

    తెలంగాణలో సీబీఐకి అనుమతి లేదట.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

    రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. గతంలో జారీ చేసిన జీవో 51ను వాపస్ తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోకి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకోవాలనే నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనూ ఆలోచనలు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై సలహాలు, సూచనలూ ఆయన స్వీకరించారని చెప్పారు. ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం.. ఒక్క ఢిల్లీ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి నేరుగా దర్యాఫ్తు చేసే అధికారంలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్) తోనే కేసు విచారణను చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతిని ఈ చట్టం తప్పనిసరి చేసింది.

    తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చేసిన అవినీతి బయట పడకూడదనే సీబీఐని తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటే ప్రజలు రేపు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రతి కార్యక్రమంలో టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతుందని, దానిని బయటపెట్టే దర్యాప్తు సంస్థలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రజల తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఎన్ని అబద్దాలు ఆడినా మునుగోడు ఉప ఎన్నికలలో విజయం తమదేనని కిషన్ రెడ్డి అన్నారు.

    Trending Stories

    Related Stories