కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైగా ఇంకొద్ది రోజులే ఉంటాయనే ప్రచారం సాగింది. అయితే ఆ ఊహాగానాలకు బీజేపీ అధిష్టానం తెరదించింది. ఆయనకు అధిష్టానం అభయ హస్తం అందించింది. నాయకత్వ మార్పు లేదని, ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. నాయకత్వ మార్పు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎంకు విశ్రాంతి ఇవ్వాలంటూ ఎంపీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను బొమ్మై అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకత్వ మార్పు విషయమై ఎవరూ మాట్లాడరాదని రాష్ట్ర నాయకులు, కార్యకర్తలను అధిష్ఠానం హెచ్చరించింది. అధికారంలో మార్పుపై ఎలాంటి ప్రకటన చేయవద్దని, గీత దాటిన వారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని చెప్పారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశానికి హాజరుకాలేదు. BS యడియూరప్ప కూడా గైర్హాజరు అయ్యారు.
కొద్దిరోజుల కిందట బసవరాజ్ బొమ్మై తన సొంత నియోజకవర్గమైన హవేరీ జిల్లాలోని షిగ్గావ్‌లో ప్రసంగం సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ అన్ని పదవులు తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. “ఏదీ శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. అటువంటి పరిస్థితిలో అన్ని అధికార పదవులు కూడా శాశ్వతం కాదు. దీనిపై మనం నిరంతరం అవగాహన కలిగి ఉండాలి” అని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని అన్నారు. గతంలో హోంశాఖ మంత్రిగా, సాగునీటి మంత్రిగా పనిచేశానని తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్‌ను మాత్రమేనని, పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు. గొప్ప విషయాలు చెప్పడానికి ఏమీ లేవని, మీరు ఆశించినట్టుగా తాను బతికితే చాలని, మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదని తాను భావిస్తానని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు స్వీకరించారు. బొమ్మై ఇటీవలి కాలంలో మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. త్వరలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు విదేశాలకు వెళ్లవచ్చని.. అందుకే నాయకత్వ మార్పు ఉండబోతోందని ఊహాగానాలు వచ్చాయి.