National

షారుఖ్ కుమారుడికి నో బెయిల్.. ఆ జైలులో సాధారణ ఖైదీగా..!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇంకొద్ది రోజులు జైలులో ఉండాల్సిందే. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ముంబయి కోర్టు విచారణ జరిపింది. ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే, కేసు దర్యాప్తుపై ఆ ప్రభావం పడుతుందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చరాస్ (గంజాయి) తాగినట్లు ఎన్సీబీ పంచనామాలో వెలుగుచూసింది. తాను గంజాయి తాగానని ఆర్యన్ ఖాన్ ఒప్పుకున్నాడని ఎన్సీబీ పేర్కొంది. ఆర్యన్ ఖాన్ స్నేహితుడైన అర్బాజ్ మర్చంట్ బూట్లలో 6 గ్రాముల గంజాయిని తీసుకెళుతుండగా తాము స్వాధీనం చేసుకున్నామని ఎన్సీబీ పంచనామాలో రికార్డు చేశారు.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి ఆశిష్ రాజన్ ప్రసాద్ ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 నిబంధన గురించి నిందితులైన ఆర్యన్ ఖాన్,అర్బాజ్ మర్చంట్‌ లకు వివరించారని పంచనామాలో నివేదించారు. దర్యాప్తు అధికారి మీ వద్ద డ్రగ్స్ ఉన్నాయా అని అడిగితే తన షూ లోపల చరాస్ దాచానని అర్బాజ్ చెప్పాడని పంచనామాలో పేర్కొన్నారు. అర్బాజ్ మర్చంట్ స్వచ్ఛందంగా తన షూ నుంచి 6 గ్రాముల చరాస్ ను జిప్ లాక్ ఉన్న బ్యాగులో నుంచి తీసి ఇచ్చాడని ఎన్సీబీ అధికారులు పంచనామాలో తెలిపారు. తాను ఆర్యన్ ఖాన్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నానని, దీనికోసమే తాము క్రూయిజ్ షిప్ లోపలకు వచ్చామని అర్బాజ్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆర్యన్ ఖాన్ కు ముంబయి సిటీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ కోరగా, న్యాయస్థానం తిరస్కరించింది.

ఆర్యన్ ఖాన్ ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. జైలులోని మొదటి అంతస్తులో ఉన్న బ్యారక్ నంబర్ వన్‌ను కేటాయించారు. దీనిని క్వారంటైన్ సెల్‌గా ఉపయోగిస్తున్నారు. ఆర్యన్ ఇందులో ఐదు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడు. ఆర్యన్‌ ను కూడా ఇతర ఖైదీల్లానే పరిగణిస్తామని జైలు అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకారం ఆర్యన్ తెల్లవారుజామున 6 గంటలకే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్, 11 గంటలకు లంచ్, సాయంత్రం ఆరు గంటలకు డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో సాధారణంగా షీరా పోహా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చపాతి, కూర, పప్పు, అన్నం వడ్డిస్తారు. ఆర్యన్ కూడా ఇవే తినాల్సి ఉంటుంది. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఇంటి నుంచి భోజనం అందే పరిస్థితి లేదు. జైలు క్యాంటీన్ నుంచి డబ్బులు చెల్లించి ఇష్టమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకునేందుకు మాత్రం అనుమతి ఉంటుంది. ముంబై తీరంలోని క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ తో పాటు 8 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.

Related Articles

Back to top button