More

    రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక.. పోటీలో లేని ఆజం ఖాన్ కుటుంబం

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గంపై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ కుటుంబానికి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. 1977 నుంచి ఆ కుటుంబానికి చెందిన సభ్యులే ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఈ సారి ఎవరూ బరిలో నిలవడం లేదు. 45 ఏళ్లలో ఇదే మొదటిసారని అంటున్నారు.

    రాంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆజం ఖాన్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ఆయన శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. దీంతో ఆ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 5వ తేదీన ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా అజంఖాన్ సన్నిహితుడు అసీమ్ రజాను ప్రతిపాదించింది. 1977 నుంచి ఆజం ఖాన్, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 1977 నుండి 2022 వరకు ఆజం ఖాన్ 12 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో 10 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు. 1980 నుంచి 1993 వరకు ఆజం ఖాన్ వరుసగా ఐదుసార్లు రాంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996లో కాంగ్రెస్ అభ్యర్థి అఫ్రోజ్ అలీఖాన్ చేతిలో ఓడిపోయారు. తరువాత 2002 నుంచి 2022 వరకు కూడా వరుసగా ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచాడు. అయితే 2019లో ఆజం ఖాన్ ఎంపీగా కూడా గెలుపొందారు. దీంతో ఆయన భార్యను రాంపూర్ స్థానం నుంచి పోటీలో దింపారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు.

    ఇక ఆజం ఖాన్, అతడి కుటుంబం చట్టపరమైన కేసులను ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజం ఖాన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆజం ఖాన్ భార్య, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తాజాగా విద్వేషపూరిత ప్రసంగం కేసులో స్థానిక కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆజం ఖాన్ శాసన సభ సభ్యత్వం రద్దయింది.

    Trending Stories

    Related Stories