నిజామాబాద్ నగరంలో పలు ఆలయాలకు ఉమ్మడి ఈవోగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వేణు వివాదంలో చిక్కుకున్నారు. మాసశివరాత్రి రోజున నీలకంఠేశ్వర ఆలయంలోని స్వామివారి పుష్కరిణిలో దేవుడి విగ్రహాలకు అభిషేకాలు జరుగుతుండగా ఈవో వేణు పుష్కరిణిలో ఈత కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. నిజామాబాద్ నగరంలో చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి ఉత్సవాల సందర్బంగా పుష్కరిణిలో ఉన్న నీళ్లతో దేవుడికి అభిషేకం చేస్తుంటారు. కానీ ఆ సమయంలోనే ఈవో ఈత కొడుతూ కనిపించారు. పుష్కరిణిలో ఈత కొట్టోద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వినిపించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. అభిషేకం జరుగుతున్నా అస్సలు పట్టించుకోకుండా దర్జాగా ఈఓ ఈత కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ఈవో వేణుపై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు ఆలయాలకు వేణు ఇంచార్జీ ఈఓగా పనిచేస్తున్నారు. ఇక ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
అభిషేకం చేస్తున్నామని ఈత కొట్టకూడదని అర్చకులు వాదిస్తున్నా ఈఓ వేణు ఈత కొట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారిని శిక్షించాల్సింది పోయి ఆలయ ఈఓగా వున్న వేణు ఈ విధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.