కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఓ వైపు ప్రయత్నాలు జరుగుతూ ఉండగా.. మరో వైపు కొత్త రకం వేరియంట్లు అందరికీ సవాల్ ను విసురుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం వేరియంట్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోకపోతే మానవాళికే పెను ప్రమాదం ఉంటుంది. కొత్త రకం వేరియంట్ ను కనుక్కోవడం.. ఆ వేరియంట్ ఎలా వ్యాప్తి చెందుతోంది.. కట్టడి చేయడం ఎలా..? ఇలాంటి ఎన్నో విషయాలను వీలైనంత త్వరగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశ విదేశాల్లో పుట్టుకొచ్చిన వేరియంట్లు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
తాజాగా పూణెలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)’ మరో కొత్త కరోనా రకాన్ని గుర్తించింది. ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాపిస్తుందని..అత్యంత ప్రాణాంతకమైందని ఎన్‌ఐవీ తెలిపింది. ఈ కొత్త రకాన్ని ఎదుర్కోవాలంటే మరిన్ని ఎక్కువ యాంటీబాడీలు కావాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేసింది. బి.1.1.28.2గా పేర్కొంటున్న ఈ రకం బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకుల్లో మాత్రమే గుర్తించినట్లు తెలిపింది. భారత్‌లో వైరస్ బాధితుల నమూనాలపై పరోశోధన జరపగా.. వారిలో కనిపించలేదని అన్నారు. ప్రస్తుతానికైతే ఈ వేరియంట్ భారతీయుల్లో లేదని తెలుస్తోంది. ఈ వేరియంట్‌ను గతంలోనూ గుర్తించినట్లు ఎన్‌ఐవీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో దీని వ్యాప్తి లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 12,200 ఆందోళనకర కరోనా వైరస్ రకాలు వెలుగులోకి వచ్చాయని.. వీటిలో చాలా వరకు అంతరించిపోయాయని ఎన్‌ఐవీ చెబుతోంది. రెండో దశకు కారణమైన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
చాలా దేశాల్లో కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చాయి. యూకే లోనూ, భారత్ లోనూ.. ఇలా పలు దేశాల్లో వేరియంట్లు బయటపడ్డాయి. ఈ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లు పెట్టింది. భారత్ లో బి.1.617 అనే వేరియంట్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కొత్తగా వెలుగుచూసే ఏ కరోనా వేరియంట్‌నూ దేశాల పేర్లతో పిలవకూడదని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్ వేరియంట్ బి.1.617కు డబ్ల్యూహెచ్‌ఓ ‘డెల్టా’గా నామకరణం చేసింది. భారత్‌లో అంతకుముందు వెలుగుచూసిన కొవిడ్ వేరియంట్ కు ‘కప్పా’ అని పేరు పెట్టింది. బ్రిటన్ కొవిడ్ వేరియంట్‌కు ‘ఆల్ఫా’ అని, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు ‘బీటా’ అని, బ్రెజిల్ వేరియంట్‌కు ‘గామా’ అని పేర్లు పెట్టింది. ఏ దేశంలో అయినా కొత్త వేరియంట్ కనుగొనబడితే వెంటనే సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.