ముఖ్యమంత్రి మీద సొంత గ్రామంలోనే దాడి

0
950

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. ఆయన స్వగ్రామంలోనే ఈ దాడి జరిగింది. ఆయన స్వగ్రామం భక్తియార్‌పూర్‌లో భారీ భద్రతా లోపం కారణంగా ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానిక సఫర్ హాస్పిటల్ కాంప్లెక్స్‌లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దాడి జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలు చూపించాయి. వెనుక నుండి వచ్చిన వ్యక్తి, వేగంగా అడుగులు వేస్తూ వేదికపైకి నడుస్తూ, విగ్రహానికి పుష్పాంజలి ఘటించేందుకు వంగి ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కొట్టడం కనిపించింది. వెంటనే అతడిని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లారు. “అతడ్ని కొట్టవద్దు. ముందు అతను ఏమి చెబుతున్నాడో తెలుసుకోండి” అని ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి తెలిపారు. “ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి కొంత లోపం ఉంది. విచారణ జరగాలి” అని అన్నారు.

ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఇతర మీడియా సంస్థలు ఆ వ్యక్తిని శంకర్ సాహ్‌గా గుర్తించారు. భక్తియార్‌పూర్‌లోని అబు మహ్మద్ పూర్‌లో నివాసం ఉంటున్న శంకర్‌కు నగల దుకాణం ఉంది. పాట్నా పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. అతని కుటుంబం ఎక్కువగా ఇంటికే పరిమితం చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు. భద్రతా లోపానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.