విజయవాడ బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ ప్రారంభం.. ఏపీలో పాలనపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు

0
708

విజయవాడ బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. నితిన్‌ గడ్కరీతో కలిసి వైఎస్‌ జగన్‌ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాను భాగం కావడం సంతోషంగా ఉందని, రోడ్ల అభివృద్ధి వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వసించారని అన్నారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న గ్రామ్ సడక్ యోజన అత్యంత కీలకమని అన్నారు. ఏపీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం ముందుకు వెళుతోందని కొనియాడారు. ఏపీకి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవని, వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశ అభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం కీలకమని అన్నారు. ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తామని చెప్పారు. ఏపీలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మిస్తున్నామని, 2024 లోపు విశాఖ-రాయ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. సీఎం జగన్ 20 ఆర్ఓబీలు అడిగారు… మేం 30 ఆర్ఓబీలు మంజూరు చేస్తున్నామని అన్నారు గడ్కరీ. విజయవాడ-నాగపూర్, బెంగళూరు-చెన్నైలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తామని వివరించారు. రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూరు ఎక్స్ ప్రెస్ హైవేని పూర్తిచేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపదని, కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి గడ్కరీ సహకారంతో బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ శరవేగంగా పూర్తయిందని పెండింగ్‌ ప్రాజెక్టులు, భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుందని అన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ రోడ్డు పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉంటోందనే అపోహలు కొన్ని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్న సమయంలో.. ‘సీఎం జగన్ 20 ఆర్ఓబీలు అడిగారు… మేం 30 ఆర్ఓబీలు మంజూరు చేస్తున్నామని’ అంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తాము అందరినీ ఒకేలా చూస్తామని తెలియజేసే ప్రయత్నాలు చేశారు.