National

చైనాలో తయారు చేసిన కార్లు మా దగ్గర అమ్మొద్దని టెస్లాకు తేల్చి చెప్పిన భారత్

సరిహద్దుల్లో చైనా సైన్యం మరోసారి తోక జాడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవే మంత్రి నితిన్ గడ్కరీ చైనా ఆధారిత కార్లను భారతదేశంలో విక్రయించవద్దని అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లాకు చెప్పామని అన్నారు. టెస్లా తయారీ అధినేత ఎలాన్ మస్క్‌తో తన సంభాషణ గురించి గడ్కరీ వెల్లడించాడు. “చైనాలో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దని నేను టెస్లాను అడిగాను. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని, అలాగే ఇండియా నుండి కార్లను ఎగుమతి చేయాలని నేను టెస్లా కంపెనీకి చెప్పాను ”అని మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. తయారీ ప్రారంభిస్తే ప్రభుత్వం తరఫున కావాల్సిన సాయం అందిస్తామని తెలిపామన్నారు.

టెస్లా తన వాహనాల ధరను రూ .35 లక్షలుగా నిర్ణయించాలని మంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద స్థానికంగా విద్యుత్ బ్యాటరీల ఉత్పత్తి పెరుగుతోందని, సమీప భవిష్యత్తులో భారతదేశం విద్యుత్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితిలో ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారతదేశంలో టెస్లా తన వ్యాపారాన్ని స్థాపించడంలో ఇది అదనపు ప్రయోజనాలను కలిగిస్తుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

విద్యుత్తు కార్లపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా డిమాండ్‌ చేస్తుండగా.. ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని.. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని టెస్లాకు గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ ఏ కంపెనీకీ ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని.. టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వివరించారు. ఇక టెస్లాకు చెందిన కొన్ని మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ఇటీవలే ధ్రువీకరించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం 60-100 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుపుకొని రూ.40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తిస్తుంది. అయితే, దీన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. అలాగే, విద్యుత్తు కార్లపై 10 శాతం సమాజ సంక్షేమ సర్‌ఛార్జిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం టెస్లాకు తన యూనిట్‌ను భారతదేశంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పన్ను రాయితీలకు సంబంధించిన కంపెనీ డిమాండ్‌కు సంబంధించి టెస్లాతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు.

Related Articles

Back to top button