జమ్మూ కశ్మీర్ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన నితిన్ గడ్కరీ

జమ్మూ కశ్మీర్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లను ఖర్చు చేస్తోంది. రక్షణ పరంగా కూడా పలు కీలక ప్రాంతాలకు రోడ్డు మార్గాలను కూడా ప్రభుత్వం శరవేగంగా పూర్తీ చేస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 27న జమ్మూ కశ్మీర్లో అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేస్తారు. సెప్టెంబర్ 28 న జడ్-మోర్, జోజిలా టన్నెల్‌ని గడ్కరీ సమీక్షించి, తనిఖీ చేస్తారని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తెలిపింది.
బారాముల్లా-గుల్మార్గ్ NH-701A తో సహా రహదారి ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. వైలూ నుండి దోనిపావా (P-VI): NH-244; మరియు దోనిపావా నుండి ఆశాజిప్ర (P-VII): NH-244 లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. శ్రీనగర్ చుట్టూ 42 కి.మీ.ల పొడవున్న నాలుగు లైన్ల రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు 2948.72 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. సెప్టెంబర్ 28 న గడ్కరీ Z- మోర్ పోర్టల్ ప్రాంతాన్ని సందర్శిస్తారు.. అలాగే Z- మోర్ ప్రధాన సొరంగం గుండా వెళతారు. Z- మోర్ సొరంగం సోనామార్గ్ పర్యాటక పట్టణానికి మంచి కనెక్టివిటీని అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్విన్ ట్యూబ్ నీల్‌గ్రార్ టన్నెల్- I, II లను కూడా సందర్శిస్తారు. జోజిలా టన్నెల్ మొత్తం పొడవు 14.15 కిమీ కాగా.. ప్రాజెక్ట్ కోసం రూ .2,610 కోట్లు ఖర్చు చేయనున్నారు.
వైద్యారోగ్య రంగంపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. దేశానికి కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ఎయిమ్స్ లాంటి సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఆవసరం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంతో ఆరోగ్య, విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని కరాడ్ సిటీలోని ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెడికల్ సదుపాయాల కల్పన కోసం కోఆపరేటివ్ సెక్టార్ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్లు, ఇతర మెడికల్ సదుపాయాల కొరత ఉన్నట్లు తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తమ విలువైన సమయాన్ని కరోనా రోగులకు కేటాయించి, వారి ప్రాణాలను కాపాడారని కేంద్ర మంత్రి ప్రశంసించారు.