More

    హైదరాబాద్ వరదలపై.. నితి అయోగ్ చెప్పిన నిజాలు..!

    రోడ్లన్నీ కాలువలయ్యాయి. బస్తీలన్నీ చెరువులయ్యాయి. డ్రైనీజీలన్నీ పొంగిపొర్లిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, కాలనీలు నీటమునిగిపోయాయి. అదేంటి, కనీసం వాన చినకు లేకపోయినా.. వరదల గురించి చెబుతున్నారని ఆశ్చర్యపోకండి. ఒక్క ఐదు నెలలు వెనక్కి వెళ్లి.. గతేడాది అక్టోబర్ నాటి హైదరాబాద్ పరిస్థితుల్ని గుర్తుచేసుకోండి. ఎస్.. ఇఫ్పటిదాకా చెప్పందంతా హైదరాబాద్ వరదల గురించే. ఈ విషయం ఇప్పుడెందుకని అనుకుంటున్నారా..? ఎందుకంటే, హైదరాబాద్ వరదలపై నితి ఆయోగ్ షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

    అసలే కరోనాతో భీతిల్లిపోతున్న భాగ్యనగరాన్ని నాడు వరదలు తీవ్రంగా బాధించాయి. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా వర్షాలు కురవడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకుని.. ఎటూ వెళ్లలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ వరదలు నగరవాసులకు ఎన్నో రాత్రులు కాళరాత్రుగా గడిచిపోయాయి. ఎన్డీఆర్ సిబ్బంది హైదరాబాద్ గల్లీల్లో పడవలు వేసుకుని తిరిగారంటే.. నాటి బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నగరం వరదల నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. హైదరాబాద్ వరదలు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. అక్రమ కట్టడాలు, ప్రభుత్వ నిర్లక్షం వల్లే.. హైదరాబాద్ ను మునుపెన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు నితి ఆయోగ్ నివేదిక సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది.

    2020 అక్టోబర్ లో హైదరాబాద్ నగరం వరద ముంపునకు గురికావడానికి.. ఆక్రమణలే కారణమంటూ నితి ఆయోగ్ నివేదిక తేల్చేసింది. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల.. వరద నీరు ఎటూ పోలేక జనావాసాలపై విరుచుకుపడిందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నీతి ఆయోగ్ చెప్పింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు, కుంటలు, బావుల వంటి చిన్నా, పెద్ద నీటివనరులు దాదాపు లక్ష వరకు ఉండేవని.. వాటి సంఖ్య ఇప్పుడు 185కి తగ్గిపోయిందని తెలిపింది. వాటిలోనూ సగానికి సగం చెరువుల ప్రవాహ మార్గాలన్నీ మూసుకుపోయాయని పేర్కొంది. నగరంలోని చెరువులు పొంగి పొర్లడం వల్లే అత్యధిక నష్టం జరిగిందని.. హుస్సేన్‌సాగర్‌ నాలాల ఆక్రమణల వల్ల వరద నీరు కాల్వల బయట ప్రవహించిందని తెలిపింది. దానివల్లే వరద ప్రభావం తీవ్రత పెరిగి ఎక్కువ ప్రాంతం నీట మునిగిందని నితి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.

    నితి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ వరదల నివారణపై నివేదికను రూపొందించింది. దేశం లోపల, సరిహద్దుల్లోనూ వరదల నియంత్రణ, నదీ యాజమాన్య కార్యకలాపాలపై ఈ అత్యున్నత నిపుణుల బృందం అధ్యయనం చేసి.. రూపొందించిన నివేదికలో.. హైదరాబాద్‌ వరదలకు కారణాలు, భవిష్యత్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచించింది. గతేడాది వరదలతో 33 మంది చెందగా, కనీసం 37 వేల 409 కుటుంబాలు ప్రభావితమైనట్లు జీహెచ్ఎంసీ అంచనా వేసింది. నగరానికి 670 కోట్ల నష్టం వాటిల్లినట్లు పురపాలక శాఖ మంత్రి చెప్పినట్టు కూడా నితి ఆయోగ్‌ వెల్లడించింది. ఐతే.. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ వద్ద కానీ, తెలంగాణ ప్రభుత్వం వద్ద కానీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు సరైన ప్రణాళికే లేదని చెప్పడం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షానికి అద్దం పడుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను నివారించాలంటే జంటనగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. నగరంలో ఎక్కడ వర్షం కురిసినా భూగర్భ డ్రైనేజీ ద్వారా మూసీ నదికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

    Related Stories