2018 నుండి నీతి ఆయోగ్ దేశంలోని 112 యాస్పిరేషనల్ (aspirational) జిల్లాలకు డెల్టా ర్యాంకింగ్ ఇస్తోంది. అక్టోబర్ 12 న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ జులై-ఆగస్టు డెల్టా ర్యాంకింగ్‌లో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలలో ఏడు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ప్రకటించారు. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం భారత ప్రభుత్వం దేశంలోని 718 జిల్లాలలో వెనుకబడ్డ 112 జిల్లాలలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమం. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వివిధ మద్దతుదారుల సహాయంతో చేపడుతోంది.
వివిధ రంగాలలో జిల్లాలు సాధిస్తున్న అభివృద్ధి కారణంగా సాధించిన పురోగతిపై ఈ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ఓ వైపు ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు ముందుకు వెళుతుండగా.. రాహుల్ గాంధీ నియోజకవర్గం వేనాడ్, కేరళ 109 వ స్థానంలో ఉంది. దిగువ నుండి నాల్గవ స్థానంలో ఉండడంతో రాహుల్ గాంధీపై విమర్శలు వస్తున్నాయి.

ఒడిశాలోని గజపతి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, యుపికి చెందిన ఫతేపూర్ రెండవ స్థానంలో నిలిచింది. జిల్లా ఉన్నత స్థానాన్ని సాధించడంలో సహాయపడే ప్రధాన సూచికలుగా ప్రాథమిక మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థికంగా తోడ్పాటు మరియు నైపుణ్యాభివృద్ధి వంటి వాటిని పరిగణలోకి తీసుకోనున్నారు.
మూడవ స్థానంలో యుపికి చెందిన సిద్ధార్థనగర్ నిలిచింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రహదారి నిర్మాణంలో గణనీయమైన పురోగతిని సాధించింది ఈ జిల్లా. వ్యవసాయం మరియు నీటి వనరుల విషయంలో మరింత పురోగతిని సాధించింది. సోన్‌భద్ర జిల్లా నాల్గవ స్థానానికి చేరుకుంది. ఆర్థిక చేయూత, ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం మరియు నీటి వనరులలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన మరియు వ్యవసాయం, ఆర్థిక చేయూతతో సహా గ్రామీణ రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా చిత్రకూట్ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. శ్రావస్తి ఆరవ స్థానంలో నిలిచింది. ప్రధానంగా వ్యవసాయం, ఆర్థికంగా ఎదగడం, ఆరోగ్యం మరియు పోషకాహారం విషయంలో ముందుకు వెళ్ళింది ఈ జిల్లా. చందౌలి జిల్లాలో గ్రామ పంచాయతీల ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడం, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక చేరికలో గణనీయమైన పురోగతిని సాధించడం ద్వారా తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. యూపీలోని ఎనిమిదవ ఆకాంక్ష జిల్లా బలరాంపూర్ కూడా పురోగతిని సాధిస్తోంది, జాబితాలో తన స్థానాన్ని త్వరగా మెరుగుపరుచుకుంటుంది. ప్రస్తుతం ఈ జిల్లా 18 వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం వేనాడ్ ఆఖరి నుండి మొదటి ఐదు స్థానాల్లో నిలవగలిగింది. మొత్తంగా 109 వ ర్యాంకులో నిలిచింది. కేరళ నుండి జిల్లాల జాబితాలో వేనాడ్ మాత్రమే ఉంది. ఆఖరి అయిదు స్థానాల్లో ఉన్న ఇతర జిల్లాలలో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్, లతేహార్, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, అరుణాచల్ ప్రదేశ్‌లోని నాంసాయ్ జిల్లాలు ఉన్నాయి.