National

రెజ్లర్ నిషా దహియాను ఎవరూ కాల్చి చంపలేదు.. నిజమిదే..!

జాతీయ స్థాయి రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె సోదరుడు సూరజ్ హర్యానాలోని సోనిపట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని మీడియాలో ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. సోనిపట్‌లోని హలాల్‌పూర్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నిషాపై కాల్పులు జరిపినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ అసత్యాలు అని తెలుస్తోంది. తాను బతికే ఉన్నానని నిషా దహియా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

తనను, తన సోదరుడిని కాల్చి చంపినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానని తెలిపారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియోను భారత రెజ్లింగ్ సమాఖ్య విడుదల చేసింది. సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ 65 కేజీల విభాగంలో నిషా దహియా కాంస్య పతకాన్ని సాధించారు.

నిషా దహియా తాను బ్రతికి ఉన్నాననే విషయాన్ని చెబుతూ వీడియోను అప్లోడ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా విడుదలైన ఒక వీడియోలో తాను సజీవంగా ఉన్నానని మరియు పూర్తిగా క్షేమంగా ఉన్నానని స్పష్టం చేసింది. నిషా దహియా సన్నిహితురాలు, రెజ్లర్ సాక్షి మాలిక్ నిషాతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసి, ఆమె బతికే ఉంది అని చెప్పుకొచ్చింది.

సోనిపట్‌లోని హలాల్‌పూర్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ దగ్గర హత్యకు గురైన రెజ్లర్ పేరు కూడా ‘నిషా దహియా’ కావడంతో చాలా మీడియా సంస్థలు పతక విజేత చనిపోయారని కథనాలను పెట్టారు. చనిపోయిన యువతి జాతీయ స్థాయి రెజ్లర్ అథ్లెట్ కాదని తేలింది. సోనెపట్‌లో కాల్చి చంపబడిన రెజ్లర్ నిషా దహియా కొత్తగా వచ్చిన క్రీడాకారిణి. ఆమె U-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత కాదని భారత జట్టు కోచ్ మీడియాకి తెలిపారు. సోనిపట్ ఎస్పీ, రాహుల్ శర్మ ట్వీట్ చేస్తూ కాల్పుల్లో చనిపోయిన నిషా దహియా (షూట్ డెడ్), పతక విజేత రెజ్లర్ నిషా దహియా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. పతక విజేత రెజ్లర్ పానిపట్‌కు చెందినవారని తెలిపారు.

Related Articles

Back to top button