బిట్ కాయిన్ పై మరింత క్లారిటీ ఇచ్చేసిన నిర్మలా సీతారామన్

0
880

బిట్ కాయిన్.. ప్రపంచంలో చాలా దేశాల్లో దీన్ని కరెన్సీగా పరిగణిస్తూ ఉన్నారు. భారత్ లో కూడా పలువురు ట్రేడింగ్ జరుపుతూ ఉన్నారు కానీ.. భారత ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం కూడా ఇవ్వలేదు. తాజాగా బిట్ కాయిన్ పై కేంద్రం వైఖరిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో స్పష్టం చేశారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. బిట్ కాయిన్ ను కరెన్సీగా పరిగణించే ప్రతిపాదనలేవీ కేంద్రం చేయలేదని నిర్మలా వివరించారు. బిట్ కాయిన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్న ప్రచారంలో నిజంలేదని తెలిపారు.

లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ స్పష్టత ఇచ్చారు. ఆర్బీఐ ద్వారా సొంత డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, దేశంలో బిట్ కాయిన్ తరహా ఇతర క్రిప్టోకరెన్సీలను అనుమతించేది లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా అధికారికంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు గత కొద్దినెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మినహా మిగిలిన క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తూ ఓ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రతిపాదించనుంది.