నిర్మల్ జిల్లా: సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. గ్రామంలో రైతు సేవ పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్నారు. దసరా పండుగ రావడంతో లాకర్లో నగదు, విలువైన డాక్యుమెంట్లు భద్రపరిచారు. ఎప్పటిలాగే సోమవారం మేనేజర్ విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు. మంగళవారం ఉదయం చూడగా కార్యాలయంలో వస్తువులు ఎక్కడికక్కడే చిందరవందరగా పడి ఉన్నాయి. సంఘ భవనం వెనుక కిటికీలో నుండి లోపలికి ప్రవేశించిన దుండగులు లాకర్, బీరువా ధ్వంసం చేసి సుమారు రూ. 8లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిపోయారు. సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటేష్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.