More

    నీరవ్ పాపం పండింది..!
    భారత్‎కు అప్పగించాలన్న యూకే కోర్టు

    ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ ప్రభుత్వం కృషి ఎట్టకేలకు ఫలిస్తోంది. భారతీయ బ్యాంకులకు ఎగనామం పెట్టిన.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి కేటుగాళ్లను.. స్వదేశానికి రప్పించేందుకు కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. విదేశాల్లో దాక్కున్న ఈ బ్యాడ్ బిజినెస్ మేన్లను తీసుకొచ్చేందుకు.. భారత్ చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు సత్ఫలితాలిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 14 వేల కోట్లు అప్పుచేసి యూకేకు పారిపోయిన.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్ పై వున్న మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని.. అతన్ని భారత్ కు అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు వెలువరించింది.

    వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ కేసు రెండున్న‌ర ఏళ్లుగా యూకే కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. మోసం, మ‌నీల్యాండ‌రింగ్ కింద అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి అత‌ను గురువారం వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. జిల్లా న్యాయమూర్తి సామ్యూల్ గూజీ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్న‌ట్లు జ‌డ్జి తీర్పు చెప్పారు. అంతేకాదు, అతను భారత్‌లో సమాధానం చెప్పాల్సిన కేసులు చాలా ఉన్నాయని కాబట్టి ఆయన్ను అక్కడికి పంపాలని ఆదేశించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు అయిన నీరవ్ మోదీ.. సాక్ష్యాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారని కూడా జడ్జి అభిప్రాయపడ్డారు.

    పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14 వేల కోట్లు ఎగవేసిన కేసులో నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని కొన్నేళ్లుగా యూకే ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే, అప్పగింత నుంచి తప్పించుకునేందుకు నీరవ్ మోదీ సాకులు వెతికాడు. మానసిక స్థితి బాగాలేదని.. భారత్ లో జైల్లు బాగుండవని సాకులు చెబుతూ.. పిటిషన్లు వేస్తూ కాలయాపన చేసే ప్రయత్నం చేశాడు. అయితే, తాజా తీర్పులో నీరవ్ మోదీ ఆరోపణలు కోర్టు కొట్టిపారేసింది. అతని మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను కోర్టు కొట్టిపారేసింది.

    అంతేకాదు, భారత్‌లోని జైళ్లలో సరైన సదుపాయాలు లేవనే వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. అక్కడ నిందితులను జైల్లో ఉంచే ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని.. బ్యారెక్ నెంబర్ 12 అనేది డిటెన్షన్‌కు సరిపడిన విధంగానే ఉందన్నారు న్యాయమూర్తి సామ్యూల్. ప్రస్తుతం లండన్‌లో ఉన్న జైళ్ల కంటే బ్యారెక్ నెంబర్ 12లో వసతులు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. నీర‌వ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని, భార‌త ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ఆధారాల‌ను గుర్తిస్తున్న‌ట్లు జ‌డ్జి వెల్ల‌డించారు. దీంతో నీరవ్ మోదీ పాపం పండింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. త్వరలోనే ఈ ఆర్థిక నేరగాడు త్వరలోనే భారతీయ జైల్లో కటకటాలు లెక్కించడం ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు.

    Trending Stories

    Related Stories