ఓ వైపు కరోనా.. మరో వైపు కేరళ మీద నిఫా వైరస్ పంజా..!

0
773

కేరళ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయలేకపోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. గత 24 గంటల్లో కూడా ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,701 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ 20-30 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ ఉండగా.. ఇప్పుడు మరో వైరస్ కేరళను కలవరపెడుతోంది.

నిఫా వైరస్‌ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. కోజికోడ్‌లో ఈ వైరస్‌ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్‌ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికీ వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని తెలిపారు. చత్తమంగళం పంచాయతీలోని చూలూరుకు చెందిన బాలుడు సెప్టెంబర్ 1 న జ్వరం, మయోకార్డిటిస్ మరియు మెదడువాపుతో ఆసుపత్రిలో చేరాడు. అంత్యక్రియలు కఠినమైన ప్రోటోకాల్ కింద నిర్వహించబడ్డాయి. ముందు జాగ్రత్త చర్యలుగా, జిల్లా మరియు ఆరోగ్య అధికారులు మరణించిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని పరిశీలనలో ఉంచారు. వారిలో 17 మంది నమూనాలను పరీక్ష కోసం సేకరించారు. అధికారులు 188 ప్రాధమిక పరిచయాలను గుర్తించారు, అందులో 20 మంది వ్యక్తులు హై-రిస్క్ కేటగిరీలో ఉన్నారు. వారిని కోజికోడ్ మెడికల్ కళాశాలకు తరలిస్తున్నారు. గుర్తించిన 20 మంది హై-రిస్క్ వ్యక్తులలో, ఇద్దరు నిఫా వైరస్ సంక్రమణ లక్షణాలతో గుర్తించబడ్డారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

చనిపోయిన వ్యక్తి నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజీస్‌ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. నిఫా జూనోటిక్‌ వైరస్‌ అని నిపుణులు చెబుతున్నారు. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్‌ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించామని’ తెలిపారు. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్‌ ఉన్న 20 మందిని కోజికోడ్‌ మెడికల్‌ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్‌ జాడలు బయటపడ్డాయని వీణా జార్జ్ తెలిపారు. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశామన్నారు. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించామని మంత్రి తెలిపారు. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్‌ బారినపడిన 17 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి నిఫా కలకలం మొదలైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నిఫా వైరస్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తాజా కేసు గురించి సమాచారాన్ని పంచుకుంది, “ప్రజారోగ్య చర్యలలో రాష్ట్రానికి మద్దతు ఇవ్వడానికి కేంద్రం కేరళకు బృందాన్ని పంపింది” అని తెలిపింది.

కోవిడ్ -19 మహమ్మారి మధ్య, నిఫా వైరస్ మూడేళ్ల తర్వాత కేరళను తాకింది. చివరగా మే-జూన్ 2018 లో నిఫా వైరస్ గురించి తెలిపారు. ఇది కేరళలోని కోజికోడ్ మరియు మలప్పురం జిల్లాల్లో 17 మంది ప్రాణాలను తీసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here