More

    విశ్వనాథన్ ఆనంద్ ను మోసం చేస్తూ చెస్ లో గెలిచారు

    అక్షయపాత్ర ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కోసం నిర్వహించిన చెస్ గేమ్ లో ప్రపంచ ప్రఖ్యాత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యజువేంద్ర చాహల్, అమిర్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, అనన్య బిర్లా తదితరులు ఆయనతో ఛారిటీ మ్యాచ్ లలో తలపడ్డారు. ఆన్‌లైన్ వేదికగా వీరంతా విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడ్డారు. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండ‌ర్‌ నిఖిల్ కామ‌త్‌ చెస్‌ గేమ్‌లో విశ్వనాథ్‌ ఆనంద్‌ను ఓడించాడు.

    చెస్ కింగ్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌ ఓడిపోవడం ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు. నిఖిల్ కామ‌త్‌ తన విజయం వెనుక ఉన్న మోసాన్ని బయటపెట్టాడు. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్ర ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూట‌ర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. వాస్తవానికి తాను ఇతరుల నుంచి, కంప్యూటర్ నుంచి కొన్ని ఎత్తుల సహాయం పొందాను. ఇది చారిటీ కోసం నిర్వహించిన గేమ్ కాబట్టి నా సంతోషం కోసమే ఇలా చేశాను. దీని వల్ల ఇన్ని సమస్యలు తలెత్తుతాయని ఊహించలేదు. ఇలా చేసినందుకు నన్ను క్ష‌మించాలని’ ట్వీట్ చేశాడు.

    ఆలిండియా చెస్ ఫెడ‌రేష‌న్ సెక్ర‌ట‌రీ భ‌ర‌త్ చౌహాన్ మాట్లాడుతూ.. ఛారిటీ మ్యాచ్‌లలో ఇలా మోసం చేసి గెలవడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఇది అనైతికం అని, మ్యాచ్ నిబంధనలకు విరుద్ధమని భరత్ చౌహాన్ విమర్శించారు. ఓ ఛారిటీ గేమ్ లో ఇలాంటి అనైతిక ఎత్తుగడలకు పాల్పడడం దురదృష్టకరమని విమర్శించారు.

    విశ్వనాథన్ ఆనంద్ ఈ విషయంపై స్పందించారు. ఒక ఛారిటీ కోసం పలు రంగాల్లోని ప్రముఖులతో చెస్ ఆడటం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి.. ఆటలోని నియమాలను పాటిస్తూ ఆడటం సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే తాను ఆడాను. ఇతరులు కూడా అదే నిజాయితీతో ఆడారని భావించాను అని విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశారు.

    విశ్వనాథన్ ఆనంద్ పేరు బయట పెట్టవద్దని నిఖిల్ కామత్ ను విశ్వనాథన్ ఆనంద్ బృందం కోరినా కూడా అతడు బయట పెట్టాడని విమర్శలు వస్తున్నాయి. ఆనంద్ భార్య, మేనేజర్ అరుణ ఆనంద్ మాట్లాడుతూ, తన భర్త పేరును కామత్ బయట పెట్టకుండా ఉండాలని స్పష్టంగా కోరినప్పటికీ, కామత్ దానిని చేశాడని విమర్శించారు. తన భర్తను కామత్ సంప్రదించాడు, అతను తన క్షమాపణలను చెప్పాలని అనుకున్నాడు. నిఖిల్ ఆనంద్ ని సంప్రదించి ఈ ట్వీట్ గురించి వివరించాడని అరుణ అన్నారు. ఆనంద్ పేరును ట్వీట్లలో చేర్చవద్దని కోరినా కూడా కామత్ ట్వీట్ లో ప్రస్తావించాడని విమర్శించారు అరుణ ఆనంద్.

    Related Stories