ట్విట్టర్ ను బ్యాన్ చేసి.. ‘కూ’ లోని ఎంట్రీ ఇచ్చిన నైజీరియా ప్రభుత్వం

0
948

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు నైజీరియాలో ఇటీవల ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే..! దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రూల్స్ ను ముహమ్మదు బుహారీ అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. అధ్యక్షుడి ఖాతానే స్తంభింపజేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా ట్విట్టర్ నే దేశంలో వాడకుండా బ్యాన్ విధించింది.

నైజీరియా ప్రభుత్వం భారతదేశ సోషల్ మీడియా యాప్ అయిన ‘కూ’ లోకి ఎంట్రీ ఇచ్చింది. నైజీరియా ప్రభుత్వం భారత్ తయారు చేసిన మైక్రో బ్లాగింగ్ సైట్ ‘కూ’ లో చేరింది. గురువారం నాడు ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ నైజీరియా కూలో తన ఖాతాను తెరిచి వేదికపై పలు పోస్టులను పోస్ట్ చేసింది. @nigeriagov ఖాతాను నైజీరియా ప్రభుత్వం మొదలు పెట్టింది.

కూ ప్లాట్‌ఫామ్ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణన్, కూ యాప్‌లో నైజీరియా ప్రభుత్వం చేరడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూ వేదికపైకి ప్రవేశించినందుకు స్వాగతం పలికారు. కూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎదుగుతూ ఉందని.. ఇప్పుడు భారతదేశాన్ని దాటి రెక్కలను విస్తరిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం చాలా భాగాలలో ట్విట్టర్ స్థానంలో కూ యాప్‌ను ప్రచారం చేస్తున్నారు.

ఈ వారం ప్రారంభంలో కూ – మేడ్ ఇన్ ఇండియా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం తమ సైట్ ఇప్పుడు నైజీరియాలో అందుబాటులో ఉందని ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వినియోగదారుల కోసం కొత్త స్థానిక భాషలను జోడించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నైజీరియాలో హౌసా, ఇగ్బో మరియు యోరుబాతో సహా 500 కి పైగా స్థానిక భాషలు మాట్లాడుతుంటారు. శనివారం నాడు అప్రమేయ రాధాకృష్ణన్ కూ ఇప్పుడు నైజీరియాలో అందుబాటులో ఉందని అధికారికంగా ధృవీకరించారు. కొద్దిరోజుల్లోనే నైజీరియా ప్రభుత్వం అధికారికంగా కూలో తమ ట్వీట్లను వేయడం మొదలు పెట్టింది.

రాధాకృష్ణన్ మాట్లాడుతూ ‘నైజీరియా స్థానిక భాషను కూడా ఎనేబుల్ చెయ్యాలని ఆలోచిస్తున్నామని.. కూ యాప్‌లో స్థానిక నైజీరియన్ భాషను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నారని’ తెలిపారు. ‘భాషా వైవిధ్యం పరంగా నైజీరియా భారతదేశంతో సమానంగా ఉంటుంది. ఈ దేశంలోనూ వందలాది ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కూ కు ప్రపంచ దృక్పథం ఉంది మరియు మైక్రో బ్లాగింగ్ చాలా అవసరమయ్యే దేశాలలో అనుమతిస్తుంది. తాము స్కేలబుల్ ప్లాట్‌ఫామ్ ను నిర్మించామని.. మేము ఇంకా ఉత్పత్తిని మెరుగుపరుస్తున్నామని’ రాధాకృష్ణన్ వెల్లడించారు. కూ చాలా దేశాలలో ఉపయోగం కోసం ఇప్పటికే అందుబాటులో ఉందని వెల్లడించారు. మయన్మార్, నమీబియా, నేపాల్, సెనెగల్, రువాండా, ఫిలిప్పీన్స్, పెరూ, పరాగ్వే.. మొదలైన దేశాల్లో కూ అందుబాటులో ఉంది.

భారతీయ వ్యతిరేక విషయాలను సెన్సార్ చేయడంపై భారత ప్రభుత్వం ట్విట్టర్‌తో విభేదిస్తున్న సమయంలో, భారత్ అభివృద్ధి చెందిన కూ ప్రారంభించబడింది. అనేక దేశాలలో ట్విట్టర్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది, మొదట భారతీయుల కోసం ప్రత్యేకంగా స్థానిక భాషలలో తన సేవలను అందిస్తోంది. త్వరలో మరిన్ని దేశాల్లో కూ సత్తా చాటాలని భావిస్తోంది.

ఇక ట్విట్టర్ ను నైజీరియా బ్యాన్ చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియా ప్రభుత్వాన్ని అభినందించారు. ఇంకొన్ని దేశాలు కూడా ఈ విధమైన చర్య తీసుకోవాలని.. ఇదే సమయంలో ఫేస్ బుక్ ని కూడా బ్యాన్ చేయాలని ఆయన కోరారు. స్వేచ్ఛగా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కును ట్విటర్, ఫేస్ బుక్ రెండూ అణగదొక్కుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని కేపిటల్ హిల్ లో జరిగిన దాడి అనంతరం ట్విటర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. అప్పటి నుండి ట్రంప్ ట్విట్టర్ కు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తూ ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 + eleven =